ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ డిస్ట్రిబ్యూటర్లు భేటీ అయ్యారు. కాగా ఈ సమావేశం ముగిసింది. సినిమా టిక్కెట్ ధరలు, థియేటర్ల ఇబ్బందులపై చర్చించారు. టికెట్ రేట్లపై ప్రతిపాదనలు ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడారు. లైసెన్స్ లేకపోవడంతో 20థియేటర్లు మూసివేశారన్నారు. తొమ్మిది జిల్లాల్లో రూల్స్ పాటించని హాళ్లను సీల్ వేశామని చెప్పారు. బాధ్యత లేకుండా థియేటర్లు నడుపుతున్నారని మంత్రి పేర్నినాని అన్నారు. గత సమావేశంలోనే రెన్యువల్ చేసుకోవాలని చెప్పామన్నారు. బీ ఫామ్ లు లేకుండా థియేటర్లు నడుపుతున్నారన్నారు. వాళ్లపై మాత్రమే చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. దరఖాస్తు చేసుకున్న థియేటర్లలో తనిఖీలు చేయలేదని చెప్పారు. కనీసం దరఖాస్తు చేసుకోని థియేటర్లలోనే తనిఖీలు నిర్వహించారని వెల్లడించారు.
9జిల్లాల్లో మొత్తం 83థియేటర్లు సీల్ చేసినట్టు మంత్రి పేర్ని నాని చెప్పారు. లైసెన్స్ లేని 22థియేర్లను ముందే మూసివేశారన్నారు. మరో 25థియేటర్లపై జరిమానా వేశామన్నారు. స్వచ్ఛందంగా మూసేశామని చెప్పడం ఏంటీ అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష ఉండదన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. నిబంధనలు పాటించని 130థియేటర్లను సీల్ చేశామన్నారు. ఏ కిరాణా కొట్టు పక్కన థియేటర్ గురించి హీరో నాని మాట్లాడారో అన్నారు మంత్రి. చెన్నైలో ఉండే సిద్ధార్ ఏపీలో థియేటర్ల గురించి మాట్లాడటం ఏంటీ అని నిలదీశారు. మేం విలాసంగా బతుకుతున్నామని ఆయనేమన్నా చూశారా అని మంత్రి పేర్ని నాని నిలదీశారు. నిర్మాత దిల్ రాజు నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఎవరు వచ్చినా వినడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ. 150, లోయర్ క్లాస్ లో రూ.50లు ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు. ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.100, లోయర్ క్లాస్ లో రూ.40లు ఉండాలని కోరినట్లు వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..