రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు.. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన తర్వాత కార్పొరేటర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. నిన్న (మంగళవారం) 10మంది కార్పొరేటర్లపై కేసులు నమోదు చేయగా, ఇవాళ మరో 22 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరికొంత మంది బీజేపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
దాడిని ఖండించిన మంత్రి కేటీఆర్..
జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు రౌడీలు, గుండాల్లా వ్యవహరించారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ కార్పొరేటర్ల శుద్ధి కార్యక్రమం..
బీజేపీ కార్పొరేటర్ల నిరసనను ఖండిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిసరాలతో పాటు లోగోను పాలతో శుభ్రం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ధర్నాను టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. బీజేపీ ధర్నా జీహెచ్ఎంసీ చరిత్రలో చీకటి రోజు అని కార్పొరేటర్లు పేర్కొన్నారు. బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. అభివృద్ధిని చూసి బీజేపీ కార్పొరేటర్లు ఓర్వలేకపోతున్నారు అని ధ్వజమెత్తారు. బీజేపీ కార్పొరేటర్లు పద్ధతి మార్చుకోవాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లు వార్నింగ్ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..