జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కరోనా వైరస్ సోకినట్లు స్వయంగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. కరోనా నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోందని వెల్లడించింది. ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు పవన్ కళ్యాణ్ కరీనా పరీక్షలు చేయించుకున్నారని.. అయితే అప్పుడు ఫలితం నెగిటివ్ వచ్చినట్లు వివరించాయి. అయినా డాక్టర్ల సూచన మేరకు పవన్ తన ఫాంహౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపాయి.
కాగా రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పవన్‌కు పాజిటివ్ ఫలితం వచ్చిందని జనసేన పార్టీ ప్రకటించింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు,కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్‌కు చికిత్స ప్రారంభించారని, ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నట్లు వివరించాయి. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తారని జనసేన పార్టీ పేర్కొంది.