Tuesday, November 26, 2024

విహార యాత్ర‌లో విషాదం – కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఏడుగురు మృతి – 32మందికి గాయాలు

బ్రెజిల్ లోని కాపిటోలియో ప్రాంతంలో ప‌ర్యాట‌క ప్రాంత‌మైన ఫ‌ర్నాస్ స‌రస్సు చుట్టూ ఉన్న అందాల‌ను వీక్షించేందుకు ప‌ర్యాట‌కులు పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. ఈ విహార యాత్ర విషాద‌యాత్ర‌గా మారింది. జ‌ల‌పాతాల‌ను ఆనుకుని ఉన్న కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతి చెందారు. ముగ్గురు గ‌ల్లంత‌య్యారు. మ‌రో 32మంది గాయ‌ప‌డ్డారు. ఆగ్నేయ బ్రెజిల్‌లో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో.. కొండచరియలు నానిపోయి ఉన్నాయి. మూడు పడవలు రాతి కొండలకు సమీపంలో ఉన్న సమయంలో అప్పటికే మొత్తబడి ఉన్న రాళ్లు కిందపడటం మొదలైంది. వారు అక్కడి నుంచి దూరం జరుగుతున్న సమయంలో ఒక పెద్ద బండ రాయి.. మూడు పడవల మీద పడిపోయింది.ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలను.. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న మరికొందరు ప్రయాణికులు వీడియో తీశారు. ఈ షాకింగ్ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

కొండచరియలు విరిగిపడే సమయంలో కొన్ని బోట్లు.. వాటికి చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో ఆ బోట్స్ దూరంగా వచ్చేయాలని మిగిలిన వారు హెచ్చరించారు. అయితే ఈలోపే ప్రమాదం జరిగిపోయింది. దీంతో వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కానీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలను బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కూడా తన ట్విట్టర్ ఖాతాలో రీ ట్వీట్ చేశారు. ‘దురదృష్టకర విపత్తు సంభవించిన వెంటనే బ్రెజిల్ నేవీ బాధితులను రక్షించడానికి ఘటన స్థలానికి తరలివెళ్లింది’ అని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. డైవ్ స్క్వాడ్, బ్రెజిలియన్ నేవీ ఆ ప్రాంతంలో గల్లంతైన వారి గురించి గాలింపు చర్యలు చేపట్టారు. తొలత 20 మంది గల్లంతైనట్టుగా అగ్నిమాపక సిబ్బంది తెలిపినప్పటికీ.. తర్వాత పలువురు వారి సొంత మార్గాల ద్వారా ఆస్పత్రుల్లో చేరడంతో ఆ సంఖ్య తగ్గింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement