ప్రభన్యూస్: ఏపీ నుంచి ఎగుమతయ్యే ధాన్యానికి తెలంగాణ సరిహద్దులో బ్రేకులు పడ్డాయి. వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం పై కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ధాన్యంపైనా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి వస్తున్న ధాన్యంలోడులను ఏపీ, తెలంగాణ సరిహద్దు..గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్ గేట్ వద్ద అధికారులు అడ్డుకుని రాష్ట్రంలోపలకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు ధాన్యం బస్తాలను లారీలను ఎక్కించి వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణకు తీసుకెళుతుండగా అక్కడి అధికారులు అడ్డుకున్నారు. అధికారులు అడ్డుకున్న ధాన్యంలోడు లారీల్లో ఏపీలో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నట్టు సమాచారం.
ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణ మార్కెట్‌కు వస్తే అక్కడి పంట విక్రయాలకు ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశ్యంతోనే లారీలను అడ్డు కుంటున్నట్టు తెలిసింది. పర్మిట్లు తీసుకుని సెస్‌లు చెల్లించి తీసుకువస్తున్న ధాన్యం లోడులను అడ్డు కోవటంలో అర్ధం లేదనీ.. ఏదైనా ఉంటే ముందుగానే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి ఉండాల్సిందని ధాన్యం వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు.ఏపీ పౌరసరఫరాల శాఖ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రారంభించింది మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది ఏపీ నుంచి ధాన్యం ఎగుమతులు గతంలో కంటే భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital