ఇప్పటికే కంట్రోల్‌లో లేని అనేక జబ్బులతో సతమతవుతున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఇప్పుడు మరో పెనుముప్పు వచ్చిపడింది. బ్లడ్ ప్రెజర్‌తో సిటీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్టు తాజాగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. కోటిన్నర మంది ప్రజల్లో దాదాపు 40శాతం మంది బీపీ సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఈ సర్వే వెల్లడి చేస్తోంది. అయితే.. నగరంలో 19శాతం మంది మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారని తాజా స్టడీలో తేలింది. ఆహారపు అలవాట్లు, ఒకేచోట కూర్చొని పనిచేసే జీవన విధానం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు ఆ స్టడీ రిపోర్టులు చెబుతున్నాయి.
ఈ మేరకు కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, గ్లోబల్ హాస్పిటల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కలిసి చేసిన స్టడీ రిపోర్ట్‌ను మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం, పని ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బీపీ, షుగర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ప్రాణాంతకంగా మారతాయని హరీశ్ హెచ్చరించారు. 30 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలని, వ్యాధి ఉన్నట్టు తేలితే రెగ్యులర్‌గా మందులు వాడాలని సూచించారు. సర్వే చేసిన డాక్టర్లను ఆయన అభినందించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 26 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 9వేల మందిపై ఈ సర్వే చేశారు. ఇందులో 5 వేల మంది వివరాలను విశ్లేషించి రిపోర్ట్ రెడీ చేశారు. ఈ 5 వేల మందిలో 40.7 శాతం మందికి బీపీ ఉందని, ఇంకో 39.8 శాతం మందికి బీపీ ముప్పు (ప్రీ హైపర్ టెన్షన్) ఉందని గుర్తించారు. సిస్టోలిక్ ప్రెజర్ 120–139 మధ్య, డయాస్టోలిక్ ప్రెజర్ 80–89 మధ్య ఉంటే ప్రీ హైపర్ టెన్షన్‌గా పేర్కొంటారు. 19.5 శాతం మందికి మాత్రమే బీపీ నార్మల్‌గా ఉన్నట్టు తేలింది. కరోనాకు ముందు తాము చేసిన స్టడీలో 25శాతం మందికి మాత్రమే బీపీ ఉండగా, ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోందని కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం జాయింట్ సెక్రటరీ, డాక్టర్ సాయి సుధాకర్ అన్నారు. కరోనా వల్ల లైఫ్ స్టైల్‌లో వచ్చిన మార్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకపోవడం, ఆహారపు అలవాట్లు, ఊబకాయం, ఎక్కువ పని గంటలు, ఆర్థిక కష్టాలు, ఉద్యోగాలు కోల్పోవడం వంటి కారణాల వల్ల జనాలు ఒత్తిడికి గురై రోగాల బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. అతేకాకుండా ఈ మహానగరంలో 70శాతం మంది అధిక బరువు కలిగి ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు.
బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఏం చేయాలే..
కరోనాకు ముందు హైదరాబాద్‌లో 25శాతం మందికి డయాబెటిస్ ఉంటే, ఇప్పుడు అది 33 శాతానికి చేరినట్టు కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం అధ్యక్షుడు, డాక్టర్ రాజీవ్‌గార్డ్ తెలిపారు. షుగర్, బీపీ లక్షణాలు బయటకు కనపడకపోవడం వల్ల జనాలు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వీటి ప్రభావం ఇతర అవయవాలపై పడి, పరిస్థితి విషమించే వరకు తెలుసుకోలేక పోతున్నారన్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న సడెన్ స్ట్రోక్‌లకు ఇవి కూడా కారణాలేనని చెప్పారు. బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఆహారంలో ఉప్పు, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలని, రోజూ వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు.