దేశంలోని టైర్-2, టైర్-3 నగరాల నుంచి తమ సేవలకు ఆదరణ పెరిగిందని, ఈ సందర్భంగా విచారణ కోసం చాలా మంది సంప్రదిస్తున్నారని ప్రీ ఓన్డ్ లగ్జరీ కార్ కంపెనీ బాయ్స్ అండ్ మెషిన్స్ వెల్లడించింది. గత ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే.. వినియోగదారుల నుంచి వస్తున్న సంప్రదింపులు 20శాతం పెరిగాయని కంపెనీ చెప్పుకొచ్చింది. విక్రయాల పరంగా టైర్-2, టైర్-3 నగరాల నుంచి దాదాపు 40శాతం వృద్ధి కనబర్చినట్టు వెల్లడించింది. బాయ్స్ అండ్ మెషిన్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ సిద్దార్థ్ చతురేదీ మాట్లాడుతూ.. గాలియర్, ఇండోర్, సూరత్, డెహ్రాడూన్, కాన్పూర్, కొయంబత్తూర్, వైజాగ్ వంటి నగరాల నుంచి సంప్రదింపులు పెరిగాయన్నారు.
టైర్-2, టైర్-3 నగరాల నుంచి ఈ డిమాండ్‌ను ఎక్కువగా గమనించామని వివరించారు. దీంతో పాటు ప్రీ ఓన్డ్ లగ్జరీ కార్లను సొంతం చేసుకుంటున్న మహిళా వినియోగదారుల సంఖ్యలో కూడా వృద్ధి కనబడిందన్నారు. తమ మొత్తం అమ్మకాల్లో 10-12 శాతం మహిళా వినియోగదారు నుంచే జరుగుతున్నాయని వెల్లడించారు. కరోనా తరువాత వ్యక్తిగత అవసరాలు పెరిగాయని, దీంతో పాటు జీవనశైలి ఉత్పత్తులకు ఖర్చు చేయడం పెరిగిందన్నారు. బాయ్స్ అండ్ మెషిన్స్ సీఈఓ ఆకాష్ చతుర్వేదీ మాట్లాడుతూ.. లగ్జరీ కార్ల కోసం ఆసక్తి కనబరుస్తున్న వినియోగదారుల సంఖ్య పెరిగిందన్నారు. అందుబాటు ధరలో ఈ విలాసవంతమైన కార్లను పొందడానికి ప్రీ ఓన్డ్ మార్గం వినియోగిస్తున్నారు. గత కొన్ని నెలల్లో కొత్త వినియోగదారుల పరంగా 75 శాతం వృద్ధిని చూశామని తెలిపారు. వీరిలోనూ టైర్-2, టైర్-3 నగరాల నుంచే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు.