కార్తీక మాసం అంటేనే పుణ్యస్నానాలు,నిత్యం పూజలతో ప్రతి ఇళ్ళు కల కలలాడుతుంటుంది. ఇక కార్తీక మాసంలో ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి. నేడు కార్తీక దీపాలు వెలిగించి నదులు,కాలువలలో వదులుతుంటారు భక్తులు. కాగా కార్తీక పౌర్ణమి పర్వదినాన హైదరాబాద్ నగరం మణికొండ పరిసరాల్లోని నెక్నాంపూర్ సరస్సు రంగుల కళ సంతరించుకున్నది. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున హైదరాబాద్‌లోని ఒడియా సమాజం బొయిట బందన ఉత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అరటి కాడలతో బోట్లు తయారు చేసి, రంగురంగుల పూలు, కాగితాలతో అలంకరించి, సరస్సులో వదులుతారు.
ప్రతి ఏడాది మాదిరిగానే నేడు కూడా ఒడియా సమాజం కన్నుల పండువగా బొయిట బందన ఉత్సవం జరుపుకుంటున్నది. ఒడియా సమాజానికి చెందిన 50 కుటుంబాల వారు నెక్నాంపూర్ సరస్సుకు చేరుకున్నారు. జగన్నాథుని ప్రతిమను నెలకొల్పి రంగురంగుల రంగోలీలు వేశారు. అరటి కాడలతో చిన్నచిన్న పడవలు తయారుచేసి, వాటిలో చిన్న నెయ్యి దీపం, చిన్న కాగడా, తమలపాకులు, పోకలు, బియ్యం, పూలు పెట్టి నీటిలో వదిలారు. ఇలా తమ పాతతరం వ్యాపారులను స్మరించుకున్నారు. మరి ఈ బొయిట బందన ఉత్సవం గురించి మీకు తెలుసా.. పూర్వ కాలంలో ఒడియా వ్యాపారులు ఇండోనేషియాలోని జావా, బోర్నియో, బాలి.. మలేషియాలోని సుమత్రా వంటి దీవులకు తమ వస్తువులను విక్రయించడానికి వెళ్లేవారు.
నెలల తరబడి అక్కడే ఉండి తమ వస్తువులను విక్రయించి వచ్చేవారు. వారు కార్తీక పౌర్ణమి రోజుననే ఎక్కువగా తమ సముద్రయానం ప్రారంభించేవారు. ఈ సందర్భంగా ఆ వ్యాపారుల భార్యలు తమ భర్తలు ప్రయాణించే పడవలకు పూజలు చేసేవారు. ఆ తర్వాత సాధరంగా సాగనంపేవారు. అందుకే ఆ సంప్రదాయాన్ని స్మరించుకుంటూ హైదరాబాద్‌లోని ఒడియా సమాజానికి చెందినవారు ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు బొయిట బందన ఉత్సవం నిర్వహించుకుంటున్నారు. గతంలో అయితే తప్పనిసరిగా అరటి కాడలతోనే పడవలు చేసేవారు. కానీ ఇప్పుడు అరటి కాడలు దొరకకపోతే వాటి బదులుగా కార్డ్‌బోర్డు, కాగితం, వస్త్రం వంటి వాటిని కూడా వినియోగిస్తున్నారు. ఏదైయితేనేం తమ సంప్రదాయాన్ని ఏదో ఒక రూపంలో కొనసాగిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..