Tuesday, November 19, 2024

పంచ్‌లిస్తూ లవ్లీనా పతక ప్రయాణం… పతకం ఖాయం చేసిన బాక్సర్‌

టోక్యో ఒలింపిక్స్‌ నుంచి ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్నారు.. దిగ్గజ మేరీకోమ్‌ పోటీకి కూడా తెరపడింది. మిగిలిన వారిలో పతకం తెచ్చేవాళ్లు ఎవరు! మీరాబాయి తర్వాత భారత పతాకాన్ని ఎగరేసిది ఎవరు? ఈ ప్రశ్నలకు తెరదించుతూ భారత పతక ఆశలకు సజీవ రూపానిస్తూ లవ్లీనా బొర్గోహైన్‌ అదరగొట్టింది ? మహిళల 69 కిలోల క్వార్టర్‌ఫైనల్లో లవ్లీనా  4-1తో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌ చిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)ని ఓడించింది. సెమీస్‌ చేరడం ద్వారా పతకం ఖాయం చేసుకుంది. ఈ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత ఫైనల్లో స్థానం కోసం ప్రపంచ నంబర్‌వన్‌ బసెంజ్‌ సర్‌మెనీల్‌ (టర్కీ)తో అమీతుమీ తేల్చుకోనుంది.

తొలిసారి ఒలింపిక్స్‌ బరిలో నిలిచిన భారత యువ బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌.. అసాధారణ ప్రదర్శనతో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఇంకో విజయం సాధిస్తే చాలు పతకం సొంతమవుతుంది. తనను నాలుగు సార్లు ఓడించిన ప్రత్యర్థిపై పంచ్‌ల మీద పంచ్‌లు విసురుతూ అసలు కోలుకోకుండా చేసి.. ఆఖరి వరకు ఆధిపత్యం ప్రదర్శించి విజయంతో మెరిసింది. గత ఓటములకు ప్రత్యర్థిపై ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. సెమీఫైనల్‌ చేరిన ఈ యువ కెరటం.. కంచుకు మించిన పతకంపై గురి పెట్టింది.

ఆరంభంలో దూకుడు.. ఆ తర్వాత ఎదురుదాడి.. ఆఖరికి రక్షణాత్మకం.. పతకం ఖాయమవ్వాలంటే తప్పక గెలవాల్సిన పోరులో లవ్లీనా అనుసరించిన వ్యూహమిది. ఇంతకుముందు నీన్‌ చిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయ పాఠాల నుంచి నేర్చుకున్న లవ్లీనా ముందస్తు ప్రణాళికను మ్యాచ్‌లో పక్కాగా అమలు చేసింది. అద్భుతమైన ఫుట్‌వర్క్‌కు తోడు పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. చిన్‌ చెన్‌ కూడా దీటుగానే స్పందించినా తొలి రౌండ్లో లవ్లీనా (30-27)దే పైచేయి అయింది. రెండో రౌండ్లో అయితే భారత బాక్సర్‌ మరింత విజృంభించింది. అయిదుగురు న్యాయ నిర్ణేతలు 10 పాయింట్ల చొప్పున ఇచ్చారంటేనే ఆమె జోరును అర్థం చేసుకోవచ్చు. ఎడమ చేతి హుక్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన లవ్లీనా.. ఎత్తును ఉపయోగించుకుంటూ చిన్‌చెన్‌ను దెబ్బ తీసింది. ఆమె పంచ్‌లకు ఒకటి రెండుసార్లు చిన్‌ చెన్‌ కిందపడింది. ఈ రౌండ్‌ను 29-28తో గెలుచుకున్న లవ్లీనా.. ఇక మూడో రౌండ్లోనూ జోరు కొనసాగించింది. రక్షణాత్మక వ్యూహాన్ని అమలు చేసిన ఆమెపై ప్రత్యర్థి ఎదురుదాడి చేసి ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేసింది. సంయమనంతో వ్యవహరించిన లవ్లీనా.. వీలుచిక్కినప్పుడు పంచ్‌లు విసరడం మాత్రం ఆపలేదు. ఎక్కడా సహనం కోల్పోకుండా.. తెలివిగా ఆడుతూ పాయింట్లు సాధించి ఈ రౌండ్‌ను 30-27తో గెలిచి బౌట్‌ను కైవసం చేసుకుంది. నెగ్గినట్లు రిఫరీ ప్రకటించగానే సింహనాదం చేస్తూ లవ్లీనా సంబరాలు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement