హైదరాబాద్, ఆంధ్రప్రభ : నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదట గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారి పూజతో బోనాలు ప్రారంభమై జూలై 28 వరకు కోటలో కొనసాగనున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు లంగర్ హౌస్ గాంధీ బొమ్మ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు మొదలై చోటా, బడా బజార్ మీదుగా గోల్కొండ కోటలోని జగదాంబికా ఆలయానికి చేరనుంది. ప్రభుత్వం తరపున అమ్మవార్లకు పట్టు వస్త్రాలను పశుసంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే స్థానిక పెద్దల సన్మాన కార్యక్రమంలో మంత్రులతో సహా ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.
గత రెండేళ్ళగా కరోనా కారణంగా గోల్కొండ బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించలేదు. ఈసారి వైరస్ ఉధృతి తక్కువగా ఉండటంతో బోనాల జాతరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ బోనాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వచ్చిన బోనాన్ని గోల్కొండ కోట జగదాంబికా అమ్మవారికి సమర్పిస్తారు. దీంతో తెలంగాణ అంతటా బోనాల జాతర మొదలవుతుంది.
గోల్కొండ కోటలో జగదాంబికా అమ్మవారికి తరతరాలుగా సేవ చేస్తున్న కుమ్మరి వంశస్తులు భక్తులకు బొట్టు పెడుతూ అర్చనలు చేస్తూ అక్కడే పూజారులుగా ఉంటారు. ఈ ఏడాది తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. బోనాల సందర్భంగా వివిధ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లను కేటాయించింది. సుమారు 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అలాగే ప్రైవేటు నిర్వహణలో ఉన్న అమ్మవార్ల దేవాలయాలకు కూడా ఒక్కో ఆలయానికి రూ.3 వేల చొప్పున ప్రభుత్వం సాయం చేయనుంది.
వైభవంగా బోనాలు – మంత్రి తలసాని
ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పశుసంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. బోనాల సందర్భంగా దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా వైద్య శిబిరాలు, నీటి సరఫరా, టాయిలెట్స్, సీసీ కెమెరాలు, మొబైలు ట్రాన్స్ఫార్మర్లు, ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
బుధవారం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి చీర తయారీ పనులను , భక్తుల వసతి భవనాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 5వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 6వతేదీన రథోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేశామన్నారు. అలయానికి నిత్యం వచ్చే భక్తులు కోసం ప్రభుత్వం, దాతల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.