Thursday, November 21, 2024

‘మహా’ హోంమంత్రికి షాక్.. సీబీఐ విచారణ!

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌‌కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశించింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఈ విచారణలో ఆధారాలు లభ్యమైతే ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని సూచించింది. విచారణ కోసం నియమించిన అధికారులకు అన్ని పార్టీల సహకరించాలని పేర్కొంది.

హోంమంత్రి వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పరమ్‌బీర్‌ తొలుత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై తొలుత హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. సుప్రీం సూచన మేరకు పరమ్‌బీర్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశారు.  దీనిపై జయశ్రీ పాటిల్ కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే, పరంబీర్ సింగ్ పిటిషన్‌పై మార్చి 30న విచారణ పూర్తిచేసిన బాంబే హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సోమవారం నిర్ణయాన్ని వెలువరించింది.

కాగా, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు హోంమంత్రి నిర్ధేశించారని మాజీ సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. పోలీస్ కమిషనర్ చేసిన ఈ ఆరోపణలు మహారాష్ట్ర ప్రభుత్వంలో కలకలం సృష్టించింది. హోంమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement