రూ. 200కోట్ల దోపిడీ కేసులో నిందితురాలిగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండైజ్ ని ఈడీ చేర్చింది.ఆమెకు వ్యతిరేకంగా చార్జ్ షీటును బుధవారం కోర్టులో దాఖలు చేసింది. ఈ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. అతడు ప్రస్తుతం ఢిల్లీ జైలులో వున్నాడు. సుఖేశ్ నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్టు గతంలో విచారణ సందర్భంగా ఆమె అంగీకరించింది. సుఖేశ్ చంద్రశేఖర్ సుమారు రూ.10 కోట్ల బహుమతులను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు పంపినట్టు ఈడీ లోగడ గుర్తించింది. ఆమెకు చెందిన 7 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. సుఖేశ్ చంద్రశేఖర్ దోపిడీ చేసిన మొత్తానికి లబ్ధిదారు ఆమేనని గుర్తించినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకునే వారని సాక్షులు కూడా ఈడీ ముందు బయటపెట్టినట్టు వెల్లడించాయి. 32 ఏళ్ల సుఖేశ్ చంద్రశేఖర్ ను ఇప్పటి వరకు 32 క్రిమినల్ కేసుల్లో పలు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్యను రూ.215 కోట్లకు దోపిడీ చేసిన కేసును అతడు ఎదుర్కొంటున్నాడు. వారి వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement