వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనానికి ఇవ్వాల (శుక్రవారం) సాయంత్రం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ములుగు జిల్లాలో ఇవ్వాల మంత్రి సత్యవతి పర్యటించారు. ఏజన్సీ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాగా, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలోని జనగలంచ వాగు వద్ద ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతింది. గన్‌మెన్లకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి సత్యవతి గన్‌మెన్లతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బోలోరే వాహనదారుడు సైతం క్షేమంగా ప్రమాదం నుండి బయటపడ్డట్టు సమాచారం.