Friday, November 22, 2024

హ్యాట్సాఫ్: కరోనా సమయంలోనూ ఫ్రెండ్‌ కోసం రిస్క్ చేసిన వ్యక్తి

కరోనా కష్ట కాలంలో బయటకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే యూపీలో మాత్రం ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం చాలా రిస్క్ చేశాడు. అతడు చూపిన తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజమైన స్నేహితుడు అంటే ఇలా ఉండాలని కితాబిస్తున్నారు. కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడానికి తన స్నేహితుడు ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న ఆ వ్యక్తి.. ఏ మాత్రం ఆలస్యం చెయ్యలేదు. రూ.10వేలు పెట్టి ఆక్సిజన్ సిలిండర్ కొన్నాడు. సిలిండర్‌ను కారులో పెట్టాడు. ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్నేహితుడి దగ్గరికి చేరుకున్నాడు. అతడికి ఆక్సిజన్ సిలిండర్ అమర్చి ప్రాణాలు నిలిపాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆ వ్యక్తి పేరు దేవేంద్ర(38). టీచర్‌గా పని చేస్తూ జార్ఖండ్‌లోని బొకారోలో నివాసం ఉంటాడు. దేవేంద్ర స్నేహితుడు రంజన్అ గర్వాల్ ఢిల్లీలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా రంజన్ అగర్వాల్ కరోనా బారిన పడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని నోయిడాలోని ఆసుపత్రికి తరలించారు. రంజన్ అగర్వాల్ దేహంలో ఆక్సిజన్ తగ్గిపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. నోయిడాలో ఆక్సిజన్ కొరత ఉంది. దీంతో ఆసుపత్రి సిబ్బంది.. రంజన్ అగర్వాల్ కుటుంబసభ్యులకు విషయం చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయాలన్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన రంజన్ అగర్వాల్ కుటుంబసభ్యులకు.. అప్పుడు.. రంజన్ స్నేహితుడు దేవేంద్ర గుర్తుకు వచ్చాడు. వెంటనే దేవేంద్రకు ఫోన్ చేసి విషయం చెప్పారు.

తన మిత్రుడు ప్రాణాపాయంలో ఉన్నాడని తెలుసుకున్న దేవేంద్ర ఏ మాత్రం ఆలస్యం చెయ్యలేదు. వెంటనే జార్ఖండ్ లోని ఆక్సిజన్ ప్లాంట్‌కు వెళ్లాడు. అక్కడ రూ.10 వేలు పెట్టి ఆక్సిజన్ సిలిండర్ కొన్నాడు. దాన్ని తన కారులో పెట్టుకున్నాడు. అలా ఆ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పయనం అయ్యాడు. ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. చివరికి నోయిడా చేరుకున్నాడు. తన స్నేహితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆక్సిజన్ సిలిండర్ అందించాడు. అలా తన ఫ్రెండ్ ని కాపాడుకున్నాడు. మిత్రుడి కోసం దేవేంద్ర చేసిన రిస్క్‌ను అంతా ప్రశంసిస్తున్నారు. దేవేంద్ర లాంటి ఫ్రెండ్ ఉన్న రంజన్ అగర్వాల్ నిజంగా అదృష్టవంతుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement