Tuesday, November 26, 2024

కరోనా విలయం: ప్రభుత్వ ఆస్పత్రిలో శవాల గుట్టలు!

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్త కేసులు రెండు లక్షలకు చేరువకాగా, మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఛత్తీస్గఢ్లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. కొత్త కేసులు, మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ఆసుపత్రుల్లో కరోనా మృతదేహాలు పేరుకుపోతున్నాయి. తగినన్ని ఫ్రీజర్లు లేకపోవడంతో మార్చురీలలో గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పడి ఉంటున్నాయి.

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్పూర్లోని డాక్టర్ అంబేద్కర్ స్మారక ఆసుపత్రిలో కరోనా మృతుల సంఖ్య కలకలం రేపుతోంది. రోజుకు పది నుంచి యాభై వరకు కరోనా రోగులు మరణిస్తున్నారు. దీంతో మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది. వాటిని ఉంచేందుకు చోటు ఉండటం లేదు. కొన్ని మృతదేహాలు అంత్యక్రియలకు తరలించేలోపు మరిన్ని వచ్చి చేరుతున్నాయి. శ్మశానవాటికలు కూడా కరోనా మృతులతో నిండిపోతున్నాయి. ఒక్క రాయ్పూర్ నగరంలోనే ప్రతి రోజు 55 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఆస్పత్రిలోని ఐసీయూతోపాటు ఆక్సిజన్ అమర్చిన పడక గదులు 100 శాతం నిండిపోయాయి. ఒకేసారి ఇన్ని మరణాలు సంభవిస్తాయని తాము ఉహించలేదని రాయ్‌పూర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మీరా బాగెల్ తెలిపారు. మృతదేహాలు పెరగడంతో ఆస్పత్రిలో తగినన్ని ఫ్రీజర్లు లేవన్నారు. ఒకే రోజు 50-60 మంది చనిపోతున్నారని, దీంతో ఆస్పత్రి ఫ్రీజర్లు చాలడం లేదన్నారని తెలిపారు.  ఎలాంటి లక్షణాలు లేని కరోనా రోగులు కూడా త్వరగా చనిపోతున్నారని, గుండెపోటుకు గురవుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు రాయ్పూర్, దుర్గ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఛత్తీస్గఢ్లో ఆదివారం రికార్డు స్థాయిలో 10,521 కరోనా కేసులు, 122 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,297కు మరణాల సంఖ్య 4,899కు పెరిగింది.

ఛత్తీస్గఢ్లో కరోనా విలయతాండవం నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న 18 జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. మరోవైపు రాష్ట్రానికి వచ్చేవారు తమ కరోనా నెగిటివ్ రిపోర్టు అధికారులకు తప్పనిసరిగా చూపించాల్సివుంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement