Tuesday, November 26, 2024

ప్లోరిడా తీరంలో ప్ర‌మాదం – ప‌డ‌వ బోల్తా – 39మంది గ‌ల్లంతు

40మందితో వెళ్తోన్న ఓ ప‌డ‌వ ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మునిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక్క‌రు మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. మిగ‌తా 39మంది ఆచూకీ తెలియ‌లేదు. ఈ ప్ర‌మాదం అమెరికాలోని ప్లోరిడా తీరంలో చోటు చేసుకుంది. మాన‌వ అక్ర‌మ ర‌వాణా చేస్తున్న క్ర‌మంలోనే ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప‌డ‌వ ప్ర‌మాదంపై అమెరికా అధికారులు మాట్లాడుతూ.. ఫ్లోరిడాలోని అట్లాంటిక్‌లో ఈ ప‌డ‌వ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అందులో 40 మంది ఉండ‌గా, వారిలో ఒక‌రు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం గురించి పోలీసుల‌కు ఆ వ్య‌క్తి ద్వార‌నే స‌మాచారం అందింద‌న్నారు. మియామీకి తూర్పున 50 మైళ్ల (80 కిమీ) దూరంలో ఉన్న బహామాస్ బిమిని దీవుల నుండి 40 మంది వ్యక్తులతో శనివారం రాత్రి పడవలో బయలుదేరినట్లు ప్రాణాలతో బయటపడిన వ్యక్తి అధికారులకు తెలిపినట్లు కోస్ట్ గార్డ్ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాణాలతో బయటపడిన వ్య‌క్తి మాట్లాడుతూ.. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరంలోని ఫోర్ట్ పియర్స్ ఇన్‌లెట్‌కు తూర్పున 45 మైళ్ల (72.4 కి.మీ) దూరంలో మయామి, కేప్ కెనావెరల్ మధ్యలో ఉన్న మార్గమధ్యంలో ప్ర‌తికూల వాతావరణ ప్ర‌భావం కార‌ణంగా ప‌డ‌వ ప్ర‌మాదానికి గురై బోల్తా ప‌డింది.

ఈ స‌మ‌యంలో అందులో ప్ర‌యాణిస్తున్న వారు ఎవ‌రూ కూడా లైఫ్ గార్డ్ ధ‌రించ‌లేద‌ని తెలిపారు. గంటకు 23 మైళ్లు (37 కిమీ), 9 అడుగుల (3 మీటర్లు) సముద్ర అల‌ల‌ వేగంతో స్థిరమైన గాలులు వీచడంతో, ఆ ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తీర‌ప్రాంత స‌రిహ‌ద్దు అధికారులు తెలిపారు. అయితే, ప‌డ‌వ‌కు మున‌కు సంబంధించిన ప‌లు వ‌స్తువులు నీటిపై తేల‌డం, ఓ వ్య‌క్తి వాటిని ప‌ట్టుకుని ఉన్న‌ట్టు గుర్తించిన అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై అత‌డిని కాపాడారు. అయితే, త‌న‌తో పాటు మ‌రో 39 మంది ఉన్న‌ట్టు చెప్ప‌డంతో బాధితుల‌ను వెత‌క‌డానికి రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. ఈ ప‌డ‌వ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన వ్య‌క్తికి గాయాలు కావ‌డంతో పాటు డీ హైడ్రేష‌న్ కు గుర‌య్యాడ‌నీ, ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడ‌ని తెలిపారు. అత‌ని ఆరోగ్య ప‌ర‌స్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement