Monday, November 18, 2024

Roundup: ఉగాది రోజున రక్తమోడిన రహదారులు.. గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉగాది పర్వదినాన రహదారులు రక్తమోడాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పది మందికిపైగా మృత్యువాత పడగా గోదావరి నదిలో పుణ్య స్నానానికి వెళ్లి మరో ముగ్గురు గల్లంతయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్‌ దిమ్మెను బలంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని చారగొండ మండలం తుక్కలపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు మృతి చెందిడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతులంతా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వాసులుగా గుర్తించారు. మరణించిన వారిలో గౌస్‌ ఖాన్‌ (55), ఫర్హానా (45), సాదిక (55), రోషన్‌ (24) ఉన్నారు. నేరేడుచర్లకు చెందిన ఐదుగురు కడపలోని దర్గాను దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలోనే కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందగా తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం అతనిని హైదరాబాద్‌కు పంపించారు. ప్రమాదానికిగల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మానకొండూరులో…
ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మానకొండూరు గ్రామానికి చెందిన తల్లి, కొడుకు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి, కూతురుకి గాయాలయ్యాయి. మానకొండూరు చెరువు కట్ట వద్ద వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు కరీంనగర్‌ నుంచి మానకొండూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఎనగందుల సౌజన్య (28), యశ్వంత్‌ (7) అక్కడికక్కడే మృతి చెందారు. అశ్విత (4), ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కూకట్‌పల్లిలో…
పీకలదాకా తాగి అతివేగంతో కారు నడిపి రోడ్డుపై వెళ్లే వారిని ముగ్గురు యువకులు హడలెత్తించారు. మద్యం సేవించి కారును నడపడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించిన వారితో తమకు రాజకీయ నాయకుల పలుకుబడి ఉందని వాగ్వాదానికి దిగారు. మద్యం మత్తులో రాత్రిళ్లు మితిమీరిన వేగంతో కారు నడిపి వీరంగం సృష్టించారు. కారును ఢీకొట్టిన సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు సలావుద్దీన్‌ అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

హయత్‌నగర్‌లో…
హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పండగ రోజే విషాదం అలుముకుంది. తాను నడిపే లారీ కింద పడి దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. లారీ సెల్ఫ్‌ మోటర్‌ పని చేయకపోవడంతో లారీ కింద కూర్చుని తనిఖీ చేస్తుండగా ఆయనపై లారీ దూసుకుపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. మరణించిన దామోదర్‌రెడ్డి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపాలపల్లి గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గోదావరిలో ముగ్గురు గల్లంతు
ఉగాది పండుగ పూట గోదావరిలో పుణ్య స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతైన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరులో జరిగింది. గ్రామ దేవతను గంగ స్నానానికి తీసుకువెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులతో పాటు ఓ బాలుగు గోదావరిలో గల్లంతయ్యారు. నదిలో మునిగిపోయిన బెడిక సతీష్‌ (17), సాయివర్దన్‌ (17), సందీప్‌ (12)గా గుర్తించారు. గల్లంతైన వారిలో సాయివర్ధన్​ మృతదేహం లభించింది. మరో ఇద్దరి కోసం జాలర్లు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement