హైదరాబాద్, ఆంధ్రప్రభ: జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏటా వందల మంది తమ ప్రాణాలను కోల్పోతుంటే.. వేలాది మంది క్షతగాగ్రులుగా మిగిలిపోతున్నారు. జాతీయ రహదారులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ రోడ్డు భద్రత సంబంధిత అంశాలకి నిధులు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడంలేదు. దాంతో ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడంలేదనేది నిపుణుల వాదన. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి 3174 కిలోమీటర్లు ఉన్నాయి. 25 జాతీయ రహదారుల్లో నిత్యం ఏదో ప్రమాదం జరుగుతుందని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రహదారులు నిర్మాణాలు పూర్తయ్యాక జరిగే ప్రమాదాలపై అవసరమైన మేర అధ్యయనంపై అంతగా దృష్టి సారించడంలేదనే మిర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్ల కాలంలో (2017 నుంచి 2020) జాతీయ రహదారులపై సుమారు 9129 మంది మృత్యువాత పడినట్లుగా సమాచారం. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు నివారించడానికి శాస్త్రసాంకేతిక పద్ధతుల్లో అధ్యయనం జరగడంలేదనే అభిప్రాయమూ సర్వత్రా వ్యక్తమవుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడంలేదని పలువురు రవాణారంగ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ రోడ్డు భద్రతకు మాత్రం కేటాయింపులు పెద్దగా పెరగడంలేదని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఒకసారి పరిశీలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రోడ్డు భద్రతకు దాదాపు రూ.230.50 కోట్లు మాత్రమే కేటాయించినట్లుగా తెలిసింది. అలాగే 2021-22 ఏడాదిలోనూ రూ.336 కోట్లు కేటాయించగా, తాజాగా ఇటీవల బడ్జెట్‌లో రూ.356 కోట్లు మాత్రమే రోడ్డు భద్రతకు కేటాయించినట్లుగా తెలుస్తోంది. వాహనాల రాకపోకలు ఎక్కువగా సాగే జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ నేపథ్యంలో రోడ్డు భద్రతకు కేటాయింపులు పెంచాల్సి ఉంది. 2017 నుంచి 2020 వరకు జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరిగింది. 2017లో దేశంలో 1,41,466 ప్రమాదాలు జరగ్గా, వాటిలో 53,181 మంది మృతిచెందారు. 2018లో ప్రమాదాలు 1,40,843 జరిగితే 54,046 మంది చనిపోయారు. 2019లో 1,37,191 ప్రమాదాల్లో 53,872 మంది మృత్యువాత పడ్డారు. అదే 2020లో 1,16,496 ప్రమాదాలు సంభవిస్తే, వాటిలో 47,984 మంది చనిపోయారు.
రాష్ట్రంలో జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాలు, మరణాల సంఖ్య చూసుకుంటే 2017లో 6,211 ప్రమాదాల్లో 1,954 మంది మృత్యువాత పడ్డారు. 2018లో 6,487 ప్రమాదాల్లో 2,064 మంది చనిపోయారు. 2019లో 7,352 ప్రమాదాల్లో 2,491 మంది చనిపోగా, 2020 ఏడాదిలో 6,820 ప్రమాదాలు సంభవిస్తే అందులో 2,620 మంది మృత్యువాత పడినట్లుగా సమాచారం.
రోడ్డున పడుతున్న కుటుంబాలు…
అతివేగం, నిద్రమత్తు, మద్యపానం, పొగమంచు, మలుపులు, బ్లాక్ స్పాట్‌లు లాంటివి ప్రమాదాలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జాతీయ రహదారుల వెంట ఇటీవల ఫుడ్ కోర్టులు, దాబాలు లాంటివి పెరుగుతున్నాయి. దాంతో రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏటా జరిగే జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో ప్రమాదాల సంఖ్య తగ్గించాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం అందర్నీ కలవరపాటుకు గురిచేస్తోంది.