Friday, November 22, 2024

Black Marketing – పత్తి విత్తనం .. బంగారమాయే! మార్కెట్లో డీలర్ల మాయాజాలం


ఆంధ్ర‌ప్ర‌భ‌ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : తెల్ల బంగారం పండించే పత్తి రైతన్న విత్తనాలు దొరక్క నల్ల బజారులో మోసపోతున్నాడు. కంపెనీలు, డీలర్ల మాయాజాలంలో చిక్కి విత్తనాల కొనుగోలు దశలోనే దుకాణాల ముందు పడిగాపులతో పడరాని పాట్లు పడుతున్నాడు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను బడా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించినా అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారు. అహరహరం శ్రమించి తెల్ల బంగారం పండించిన రైతులు మొన్నటి వరకు మార్కెట్లో ధర లేక అవస్థలు పడితే… ఇప్పుడు విత్తనాలు దొరక్క దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

తొలకరికి ముందే రోడ్డెక్కిన రైతులు…

తెలంగాణలోని అత్యధికంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 14.40 లక్షల ఎకరాల్లో వర్షాధారంపైనే రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. పత్తి విత్తనాల మార్కెట్ తో వేల కోట్ల వ్యాపారం చేసే పత్తి డీలర్లు, ఆయా కంపెనీలు రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకొని డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టిస్తోంది. దుక్కి దున్ని భూములు చదును చేసుకుని ఉత్సాహంగా రైతులు విత్తనాల కోసం వెళితే.. మార్కెట్లో నో స్టాక్ బోర్డులు చూసి నిరాశకు లోనవుతున్నారు. ఒక ఎకరానికి రెండు బ్యాగులు అవసరమయ్యే పత్తి విత్తన బ్యాగులు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లైసెన్సు కలిగిన 1462 విత్తన దుకాణాలు ఉన్నాయి. రాశి- 659 రకం పత్తి వంగడం సాగు చేసిన రైతులు ఆశాజనకంగా దిగుబడులు సాధించారు. ఈసారి అదే కంపెనీ విత్తనాలు కావాలని ఎగబడడంతో వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు విత్తనాల కొరత ఉందంటూ ప్రత్యామ్నాయ విత్తనాలు అంటగడుతున్నారు.

- Advertisement -

గ‌తంలో న‌కిలీ విత్త‌నాల‌తో మోసం..

గతంలో ఆర్భాట ప్రచారానికి మోసపోయి అవే కంపెనీల విత్తనాలు సాగు చేసి నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈసారి నూటికి 80 శాతం మంది రైతులు రాశి 659కంపెనీ పత్తి విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తుండగా మార్కెట్లో దొరకని పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలోనే 10 లక్షల 50 వేల విత్తనాల బ్యాగులు అవసరమని అధికారులు గుర్తించగా, కేవలం 1,35,000 బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని బుకాయిస్తున్నారు. తమ జీవితాలతో ముడిపడి ఉన్న పత్తి విత్తనాల కొనుగోళ్లలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడా రైతులు పెద్ద మొత్తంలో పత్తి విత్తనాల బ్యాగులను కృత్రిమ కొరత సృష్టించి ఆ తర్వాత తొలకరి వానలు పడగానే రైతులకు ఐదు రేట్లు అధికంగా ధర వసూలు చేసి అంటగట్టే అవకాశం పొంచి ఉంది. మంగళవారం ఆదిలాబాద్ మార్కెట్లో రైతులు రాశి విత్తనాల కోసం రోడ్డెక్కి నిరసన చేయాల్సి వచ్చింది.

సీడ్ ప్రాసెసింగ్ లో ఆలస్యం..

పత్తి విత్తన కంపెనీలు సీడ్ ప్రాసెసింగ్, జెర్మినేషన్ పరీక్షలు, ఆ తర్వాత విత్తన శుద్ధి, ప్యాకింగ్, సర్కారు అనుమతి తదితర విధివిధానాలు పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే విత్తనాలు బయట మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడంతో రైతులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. జూన్ రెండవ వారం వరకు రైతులు ఓపిక పడితేనే మంచిది. రెండో వారంలోనే భూమిలో తేమశాతాన్ని బట్టి విత్తనాలు విత్తు కోవాలి. పత్తి విత్తనాల కొరతపై జిల్లా కలెక్టర్ తో సంప్రదించి నియంత్రణ చర్యలు చేపడుతాం. రైతులు సర్టిఫై చేసిన ప్రత్యామ్నాయ విత్తనాలను కూడా కొనుగోలు చేస్తే మంచిది.

= జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య

ప్రతి రైతుకు కూపన్లు జారీ చేయాలి…

గుజరాత్ తర్వాత తెలంగాణలోని అత్యధికంగా పత్తి పంట సాగవు తోంది. హరి ప్రణాళికలోనే ముందస్తుగా విత్తనాల నియంత్రణపై కట్టడి చేయాల్సి ఉంటుంది. బలహీన రైతులకు విత్తనాలు దురగాలంటే పాసుబుక్కుల ఆధారంగా కూపన్లు జారీ చేసి అందరికీ డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు అందించాలి. అధికారులు కూడా రైతుల్లో అవగాహన చైతన్యం పెంపొందించాలి.

= రిటైర్డ్ వ్యవసాయ అధికారి నర్సింగరావు

Advertisement

తాజా వార్తలు

Advertisement