బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, దాంతో భయపడవద్దని ప్రముఖ ఈఎన్‌టీ వైద్యుడు ఎస్‌కెఈ అప్పారావు వెల్లడించారు. ప్రస్తుతం ప్రజానీకాన్ని వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ (మ్యూకార్‌మైకోసిస్) కొత్తదేమీ కాదని, తెలియని వ్యాధి అంతకంటే కాదని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ సొసైటీ ఆప్ ఓటాలజీ పూర్వపు అధ్యక్షుడు అయిన ఆయన ప్రస్తుతం ప్రజానీకానికి దడపుట్టిస్తున్న బ్లాక్ ఫంగస్‌ను నివారించేందుకు ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఎంపోటెర్సిన్ బి ఇంజక్షన్‌ను 4-6 వారాలు వినియోగించడం ద్వారా అదుపు చేయవచ్చని సూచించారు.
ఈ వ్యాధి అంటువ్యాధి కాదని అయితే కొన్ని గంటలు, రోజుల్లోనే ఉధృతరూపం దాల్చి రోగికి ప్రాణహాని చేస్తుందన్నారు. దీన్ని గుర్తించిన తక్షణమే వైద్యచికిత్స అందించడం ద్వారా రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చన్నారు. కరోనా అనంతర వ్యాధిగా హైరిస్క్ గ్రూప్‌లలో ఇది ప్రస్తుతం కన్పిస్తుందన్నారు. కోవిడ్-19 నివారణ కోసం స్టెరాయిడ్స్ వినియోగం, ఆర్ధ్రతతో కూడిన ఆక్సిజన్ థెరపీ, ఇమ్యూనినో మాడ్యూలేటర్స్ వినియోగం వంటివి బ్లాక్‌ఫంగస్ వ్యాధికి దోహాదం చేస్తున్నాయన్నారు. వాతావరణంలో ఫంగస్, స్పోర్స్ విచ్చలవిడిగా వ్యాపించి ఉంటాయని వివరించారు. రోగి వ్యాధి నిరోధకత తగ్గిపోవడంతో పాటు నియంత్రణలో లేని మధుమేహం, ట్రాన్స్‌ప్లేంటీస్, ఎయిడ్స్, ల్యూకేమియా, కేన్సర్ వ్యాధి గ్రస్తులు మ్యూక్రో మైకోసిస్ (మ్యూకార్‌మైకోసిస్) బారినపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో నెమ్మదిగా బ్లాక్ ఫంగస్ టెర్రర్ ప్రజల్ని వణికించే స్థాయికి ఎదుగుతుందన్నారు. అయితే దీనికి భయపడాల్సిన పరిస్థితులు లేవని ఈఎన్‌టీ, అఫ్తామాలజీ, న్యూరో, డెంటల్ సర్జన్లు, నెఫ్రాలజిస్ట్, జనరల్ ఫీజిషియన్‌ల బృందం ఈ వ్యాధికి సమర్ధవంతంగా చికిత్స అందించగలుగుతున్నారని వివరించారు.
వ్యాధి గుర్తింపు ఇలా..
కోవిడ్ అనంతర రోగుల్లో గుర్తించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని అప్పారావు సూచించారు. వైద్యులు ముక్కులోపలి భాగాన్ని ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి నిర్దారిస్తారన్నారు. అలాగే బయాప్సీ చేసి ఏ రకమైన ఫంగ్‌స్ ఈ వ్యాధికి కారణం మన్నది నిర్దారిస్తారని వెల్లడిరచారు. ఎంఆర్‌ఐ స్కాన్ ద్వారా ఆయాభాగాల్లో తీవ్రతను గుర్తించి సకాలంలో సరైన వైద్యం అందించడం ద్వారా రోగిని రక్షిస్తారన్నారు. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా ఫంగస్ సోకిన కణజాలాన్ని తొలగిస్తారన్నారు. దాంతో పాటు ఎంఫోటెర్సిన్ బి ఇంజక్షన్‌ను 4-6వారాలు ఇవ్వడం ద్వారా బ్లాక్ ఫంగ్‌స్ వ్యాధిని నివారించవచ్చన్నారు. బ్లాక్‌ఫంగస్/ మ్యూకార్‌మైకోసిస్ నివారించేందుకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడంతో పాటు ఈఎన్‌టీ, అఫ్తామాలజీ, డెంటల్, న్యూరో సర్జన్ల బృందంతో పాటు నెప్రాలజీ, జనరల్ ఫిజీషియన్ల వైద్య బృందాన్ని ఆయా వార్డులో అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే కోవిడ్ రోగులకు స్టెరాయిడ్స్ వినియోగాన్ని సహేతుకంగా వినియోగించడం, మోతాదు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు బ్లడ్‌గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ ఎస్‌కెఇ అప్పారావు వివరించారు. ఇంకా ఈ వ్యాధిపై అనుమానాలు ఉంటే 9160066564 నెంబర్‌కు సంప్రదించాలని ఆయన సూచించారు.