Tuesday, November 26, 2024

చేసేది రామనామ జపం.. ఇతర పార్టీల లీడర్లను లాక్కొనేందుకు దర్యాప్తు సంస్థలపై నెపం: కవిత

‘రామ’ నామం జపించి.. ఇతర పార్టీల నాయకులను ప్రలోభపెట్టడమో లేక బలవంతంగా లాక్కోవడమే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పని అని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం అన్నారు. “రామ్ రామ్ జప్నా, పరాయ లీడర్ అప్నా. అట్లా కాకపోతే ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఐటీ శాఖ లేదా సీబీఐని వారిపై  నెపం నెట్టండి. నీకేది కావాలో అదే చేయి. అయినా టీఆర్‌ఎస్ నాయకులు ఎదురు నిలబడి, సవాళ్లపై పోరాడి గెలుస్తారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నారు’’ అని కవిత అన్నారు. కామారెడ్డిలో జరిగిన ‘ఆత్మీయ సమ్మేళనం సభ’లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ‘వాట్సాప్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు రూ.2000 ఇస్తోంది. కానీ, దీన్ని మోదీజీ ఇచ్చారని వాట్సాప్‌లో అబద్ధాలు చెబుతున్నారు. మా మంచి పనిని ప్రోత్సహించడంతో పాటు వారి తప్పులపై పోరాడాలని మా పార్టీ కార్యకర్తలను నేను కోరుతున్నా ”అని ఆమె అన్నారు.

తెలంగాణలో బీజేపీకి ఎలాంటి సంస్థాగత బలం లేదని, అందుకే తమ అధికారాన్ని, డబ్బును దుర్వినియోగం చేసి ఇతర పార్టీల నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆమె అన్నారు. రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు ఇంచుమించు దగ్గర పడుతున్న వేళ, మాస్ అప్పీల్ ఉన్న చాలా మంది నాయకులు బీజేపీ వల్ల వేధింపులకు గురవుతున్నారని, ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రముఖులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులను వేధింపులకు గురిచేస్తున్నారని కవిత అన్నారు. తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి.. ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ బుధవారం వరుసగా రెండో రోజు సోదాలు కొనసాగించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండ్రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు..

- Advertisement -

మంత్రి, ఆయన కుమారులు, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులు, మల్లారెడ్డి గ్రూప్‌ ఆధ్వర్యంలోని వివిధ సంస్థల ఉన్నతాధికారుల వద్ద ఏకకాలంలో సోదాలు జరిగాయి. హైదరాబాద్‌తో పాటు పొరుగున ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 50కి పైగా బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. పన్ను ఎగవేత విభాగానికి చెందిన 200 మంది ఐటీ సిబ్బంది మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.8 కోట్ల నగదు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు, సీజ్‌లపై బుధవారం సాయంత్రంలోగా ఐటీ శాఖ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అనధికార సమాచారం ప్రకారం.. మల్లా రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ సంస్థలు పన్ను ఎగవేత ఆరోపణలపై దాడులు జరుగుతున్నాయి. మల్లారెడ్డి మెడికల్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపులు కూడా అసంబద్ధంగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ సీట్ల లావాదేవీలకు వినియోగించిన బ్యాంకు ఖాతాలపై ఐటీ అధికారులు విచారణ చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు ఎం. రాజశేఖర్‌రెడ్డి, సీఎంఆర్‌ గ్రూపు సంస్థల చైర్మన్‌ సోదరుడు గోపాల్‌రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్‌లో మల్లారెడ్డి, ఆయన కుటుంబం పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలపై ఐటీ శాఖ విచారణ జరుపుతోంది. మల్లారెడ్డి యూనివర్సిటీని కలిగి ఉండి, పలు ప్రొఫెషనల్ కాలేజీలను నడుపుతున్న మల్లారెడ్డి మాల్స్, పెట్రోల్ పంప్‌లలో పెట్టుబడులు పెట్టడంతో పాటు పలు చోట్ల భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement