గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించినప్పటికీ అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ ఈసారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా ముందస్తు జాగ్రత్త పడుతోంది. 224 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇప్పటికీ 123 చోట్ల ఆధిక్యంలో ఉండి.. మ్యాజిక్ ఫిగర్ 113కు అదనంగా 10సీట్లు సాధించింది. అయినప్పటికీ కాంగ్రెస్ కు గత అనుభవాల భయం వెంటాడుతూనే ఉంది. బీజేపీ వలకు చిక్కకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది.
పీసీసీ అధ్యక్షుడు డి.శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి ఎమ్మెల్యేలను ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికైన తన ఎమ్మెల్యేలను ముందుగా బెంగళూరుకు తరలించేందుకు 15 హెలికాప్టర్లను ఆయా ప్రాంతాలకు పంపింది. బెంగళూరుకు చేరుకున్న అనంతరం వారిని సరిహద్దు రాష్ట్రం తెలంగాణకు కానీ, లేదా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ కు కానీ పంపనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 123, బీజేపీ 68, జేడీఎస్ 26, స్వతంత్రులు 5 స్థానాల్లో లీడ్స్ లో కొనసాగుతున్నారు. అలాగే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ కనకపుర స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ కు బోణీ చేశారు.