Thursday, November 21, 2024

Breaking: బీజేపీ క‌ళ్లు స‌ల్ల‌వ‌డ్డ‌ట్టున్న‌య్‌.. సీఎం ఆఫీసు ఖాళీ చేస్తున్న ఉద్ధ‌వ్‌!

కేంద్రంలోని బీజేపీ రాజ‌కీయ ఆట‌ల‌కు ఇప్ప‌టికే దేశంలోని ప‌లు ప్ర‌భుత్వాలు కుప్ప‌కూలాయి.. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లోని ‘మహా వికాస్​ అఘాడీ’ ప్రభుత్వం కూడా కుప్పకూలే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని వెనకాల మొత్తం బీజేపీ లీడర్లే కథ నడిపించారని పొలిటికల్​ అనలిస్టులు అంటున్నారు. శివసేనలోని ఏక్​నాథ్​ షిండేను ఉసిగొల్పి పార్టీ ఎమ్మెల్యేలను రెబల్స్​గా మార్చారన్న అపవాదు ఈ దెబ్బతో బీజేపీ మూటగట్టుకుంది.

ఇక.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్షా’ను వీడేందుకు రెడీ అయ్యారు. ముంబై సబర్బన్ బాంద్రాలోని సొంత నివాసం ‘మాతోశ్రీ’కు మారుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అధికార నివాసంలోని ఆయన లగేజీని సిబ్బంది ప్యాక్ చేసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడీ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్‌ అయ్యాయి. శివసేన మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం సాయంత్రం ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రజలనుద్దేశించి ఉద్వేగంతో ప్రసంగించారు.

సీఎం పదవి కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదన్న ఉద్ధవ్‌, సూరత్‌కు వెళ్లి అక్కడ ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నారని రెబల్‌ నేతలను ప్రశ్నించారు. వెన్నంటే ఉంటామని చెప్పి ఎందుకు మోసం చేస్తున్నారని నిలదీశారు. తమను బలవంతంగా తీసుకెళ్లారని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారని, అయితే ఆ విషయాలు తనకు అవసరం లేదన్నారు. శివ సైనికులే తనకు ముఖ్యమని, వారు ఏం చెబితే అది చేస్తానని అన్నారు ఉద్ధవ్​. తాను రాజీనామాకు కూడా సిద్ధమని, లేఖ కూడా కార్యాలయంలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రెబల్‌ ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే దీనిని తీసుకుని గవర్నర్‌కు ఇవ్వవచ్చని తెలిపారు. అవసరమైతే పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. ఒక శివ సైనికుడు సీఎం అయితే సంతోషిస్తానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement