మునుగోడు ఎన్నికల్లో గెలిచే సత్తాలేక భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుందా అన్న ప్రశ్నకు అవుననే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి కొనుగోలు చేసేందుకు యత్నాలు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారని తెలుస్తోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిని ప్రలోభ పెట్టినట్టు తెలుస్తోంది.
నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వీరు భారీగా డబ్బులు ఎర వేసేందుకు యత్నిస్తూ హైదరాబాద్‌లో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది.
పట్టుబడిన వారిలో బీజేపీ నేతలు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ ఉన్నారు. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్‌లోని పీవీఆర్ ఫామ్ హౌస్‌లో ఈ తతంగం జరిగింది. పోలీసులకు దొరికిపోయిన వారిలో దక్కన్ ప్రైడ్ హోటల్ యజమాని నందకుమార్ కూడా ఉన్నారు. ఈయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని సమాచారం. స్వామి రామచంద్రభారతి ఢిల్లీ నుంచి రాగా, సింహయాజులు తిరుపతికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
పోలీసులకు సమాచారమిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో రైడ్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ప్రలోభపెడుతున్నట్లు ఎమ్మెల్యేలు సమాచారమిచ్చినట్లు వెల్లడించారు. వీరి సమాచారంతోనే ఫామ్‌హౌజ్‌పై రైడ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని, ఆ సమయంలో తిరుపతి నుంచి వచ్చిన స్వామిజీ సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ రామచంద్రభారతితో ఉన్నారని స్టీపెన్ రవీంద్ర వివరించారు. వీరు ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్టు తెలిసిందన్నారు. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని అన్నారు.