ప్రభన్యూస్ బ్యూరో, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఈటల రాజేందర్ బీజేపీని కొంత టెన్షన్ పెడుతున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటల తన సొంత ఇమేజ్‌ను నమ్ముకుని బరిలోకి దిగారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్ రావు మంత్రాంగం తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం హరీశ్ రావు హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. ఎన్నికల్లో పోటీకి నిలబడ్డ కొంతమంది ఇండిపెండెంట్లకు కేటాయించిన గుర్తులు ఆ పార్టీని ఇబ్బందుల్లో పడేయనున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందులో రోడ్ రోలర్ సింబల్‌తోపాటు మరో గుర్తు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ రెండు గుర్తుల కారణంగా గతంలో జరిగిన పలు ఎన్నికల్లో టీఆర్ఎస్ పెద్ద దెబ్బే తగిలిందని, దీంతో ఈసారి అట్లాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారు.
టీఆర్ఎస్‌కు కొన్ని గుర్తులు ఇబ్బందికరంగా మారితే.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్‌కు మరో రకమైన సమస్య తలెత్తుతోంది. గతంలో అనేకసార్లు జరిగిన ఎన్నికల్లో తనది కారు గుర్తు అని ప్రచారం చేసుకున్నారు ఈటల.
ఈటల అంటే.. లోకల్‌గా చాలామందికి యాదికొచ్చేది కారు గుర్తు మాత్రమే. ముఖ్యంగా గ్రామాల్లోని కొంతమంది వృద్ధులు, మహిళలు ఇప్పటికీ ఈటల రాజేందర్ కారు గుర్తు మీదే పోటీ చేస్తున్నారని భావిస్తున్నారనే చర్చ కూడా ఉంది. బీజేపీ నేతలతోపాటు ఈటల రాజేందర్ కూడా తమ ప్రచారంలో పువ్వు గుర్తును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నప్పటికీ.. కొందరు ఈ విషయంలో తికమకపడి కారు గుర్తుకు ఓటు వేస్తారేమో అనే టెన్షన్ బీజేపీ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.