Friday, November 22, 2024

బిగ్ షాట్స్ పై ఎపి బిజెపి గురి….

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో బిగ్‌షాట్స్‌ లక్ష్యం గా ఏపీ బీజేపీ చేరికల పర్వాన్ని చేపట్టింది. రాష్ట్రంలో పేరొందిన వ్యక్తులను పార్టీలోకి తీసుకొస్తే ప్రజల్లో పార్టీ జోష్‌ పెరుగుతుందని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం పలువురు పారిశ్రామిక, రాజకీయ ప్రముఖులతో బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నా రు. రాష్ట్రంలో పేరుమోసిన తులసీ సీడ్స్‌ అధినేత తులసి రామచంద్ర ప్రభు కుమారునితో కలిసి రాజమండ్రిలో బీజేపీలో చేరారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్‌ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కొద్ది రోజుల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. పలుమార్లు మంతనాలు జరిపిన తర్వాత కేంద్ర బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తృత పరిచయాలు ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాకతో పార్టీ క్రేజ్‌ పెరగడంతో పాటు కీలక వ్యక్తులను రప్పించేందుకు మార్గం సుగమవుతుందని పార్టీ నేతలు చెపుతున్నారు. కొద్ది రోజుల్లోనే పార్టీలో చేరికల బాధ్యతలను కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటెల రాజేందర్‌కు ఇదే తరహా బాధ్యలను బీజేపీ అధిష్టానం అప్పగించింది. ఈటెల రాక తెలంగాణ బీజేపీలో జోష్‌ పెంచిందని పార్టీ నేతల అభిప్రాయం. ఇదే తరహాలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా క్రియాశీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.

తులసి రామచంద్ర ప్రభు చేరిక..
గుంటూరు జిల్లాకు చెందిన తులసి సీడ్స్‌ అధినేత తులసి రామచంద్ర ప్రభు, ఆయన కుమారుడు యోగేష్‌ చంద్ర శుక్రవారం రాజమండ్రిలో కేంద్ర పార్టీ ప్రముఖుల సమక్షంలో పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రామచంద్ర ప్రభు ప్రజారాజ్యం తరుపున పోటీ చేశారు. అప్పట్లో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణపై ఆయన ఓటమి పాలయ్యారు. పారిశ్రామికంగా సేవారంగల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన తులసి రామచంద్ర ప్రభు రానున్న ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు పోటీ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన తులసి రామచంద్ర ప్రభు చేరికతో పార్టీ బలోపేతం అవుతుందనేది బీజేపీ నేతల భావన. పైగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఇటీవల రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అదే సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర ప్రభు రాకతో గుంటూరు జిల్లాలో కొంత ప్రభావం చూపుతుందని పార్టీ నేతలు చెపుతున్నారు.

పల్లంరాజుతో మంతనాలు..
గత కొద్ది రోజులుగా కేంద్ర మాజీమంత్రి పల్లంరాజుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో క్రియాశీలక నేతగా వ్యవహరించిన పల్లంరాజు కేంద్రంలో రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలోనే పార్టీ నేతలు పల్లంరాజును రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తే ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. కొద్ది రోజుల కిందట పార్టీలో చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మరోసారి పల్లంరాజుతో మంతనాలు జరిపారు. ఢిల్లిdలోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరిద్దరూ సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పట్లో కోలుకోదనే అభిప్రాయం వీరి మధ్య చర్చల్లో చోటు చేసుకుంది. ఇదే సమయంలో బీజేపీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తున్న విషయాన్ని వివరించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి పార్టీలో చేరి పోటీ చేస్తే గెలుపు ఖాయమనే అభిప్రాయాన్ని పల్లంరాజు ముందు ఉంచారు. ఒక వేళ ఓడినా కేంద్రంలో కీలకమైన పదవులు కూడా ఇవ్వనున్నట్లు ఆయనకు హామీ ఇవ్వగా ఆలోచించుకునేందుకు కొంత వ్యవధి అడిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

స్టార్‌వార్‌తో ముందుకు..
రాష్ట్రంలో ప్రముఖులను పోటీకి దించి పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పదకొండు పార్లమెంటు స్థానాలను పార్టీ ఎంపిక చేసింది. అక్కడ బూత్‌ కమిటీలు, శక్తి కేంద్రాలను పటిష్టం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలని నిర్ణయించింది. ఆ పదకొండు పార్లమెంటు స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన పథకాలు, అందిన సాయం సహా పలు అంశాలను బూత్‌ కమిటీలు, శక్తి కేంద్రాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలను ఎన్నికల్లో పోటీకి దించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement