హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లి ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో బీజేపీ దూకుడు పెంచింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. రానున్న తెలంగాణ అసెంబ్లి ఎన్నికల్లో 90 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడమ ఆ పార్టీ మిషన్ -90 పేరిట ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మిషన్-90 లక్ష్యాన్ని చేరేలా ఎన్నికల సన్నాహక సమావేశాలకు కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండేలా ప్రత్యేక వ్యూహాన్ని ఖరారు చేసింది. నియోజకవర్గాల వారీగాబూత్ స్వశక్తికరణ్ కార్యక్రమం కింద ప్రత్యేక సమావేశాలకు ప్లాన్ చేసింది. 15 రోజుల్లో 119 నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహించడం ద్వారా పార్టీ బలాన్ని పెంచుకునేందుకు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ నెల 25 నుంచి మొదలు పెట్టి 15 రోజుల్లో ఈ సమావేశాలను పూర్తి చేసి ఎన్నికల సమయం నాటికి ప్రజల్లో పట్టు సంపాదించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యూహంగా కనిపిస్తోంది. నియోజకవర్గ సభలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు డీకే అరుణ, వివేక్ వెంకటస్వ్‌మి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, విజయశాంతి, ధర్మపురి అరవంద్, రఘునందన్‌రావు, సోయం బాబూరావు, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, తమిళనాడు వ్యవహారాల ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఇంధ్రసేనారెడ్డితోపాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సంసిద్ధం చేయటంపైనే నియోజకవర్గ పర్యటనల్లో ముఖ్య నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. నియోజకవర్గాల సమావేశాల ద్వారా పార్టీ బలోపేతంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. నియోజకవర్గాల సభల తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 15 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పించిన నియోజకవర్గాల వారీగా సమావేశాలకు బీజేపీ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. మొన్నటి వరకు ప్రజా గోస- బీజేపీ భరోసా పేరుతో 11వేల కార్నర్ మీటింగ్‌లను కాషాయ పార్టీ పూర్తి చేసింది. తాజాగా చేపట్టనున్న 119 నియోజకవర్గాల సమావేశాల్లో పన్నా ప్రముఖు మొదలు బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, మండల, జిల్లా కమిటీల నిర్మాణంపై పార్టీ ఫోకస్ చేయనుంది. తెలంగాణలో మొత్తం 34600కు పైగా ఉన్న బూత్ కమిటీలను నియమించడం, 9వేల శక్తి కేంద్రాల్లో పూర్తి స్థాయిలో నేతలను నియమించి ఎన్నికలకు సమాయాత్తం కావాలని బీజేపీ భావిస్తోంది. ఇందు కోసం 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి కేడర్‌తో ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది. నియోజకవర్గాల వారీగా బూత్ స్వశక్తికరణ్ సమావేశాలు ముగిసిన అనంతరం అధిష్టానం అనుమతితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రను చేపట్టనున్నారు.