హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించడంతో పాటు బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో ఉన్న బీజేపీ నేతలు పార్టీకి ఏ మాత్రం పట్టులేని జిల్లాలు, నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాల వారిగా పార్టీ బలాబలాలను బేరీజు వేసుకోవడంతో పాటు గెలుపు గుర్రాలెవరన్న అంశంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఆషావాహులు అధికంగా ఉన్న నియోజకవర్గాలు, గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాల వివరాలతో పాటు పార్టీకి పట్టులేని ప్రాంతాలు, అభ్యర్థులున్నా కింది స్థాయి కార్యకర్తలు లేని ప్రాంతాలు, అసలు పార్టీకి ఏ మాత్రం ఆధరణ లేని ప్రాంతాలపై వివరాలను పార్టీ సేకరిస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ మొదటి నుంచీ పట్టణ ప్రాంతాలకే పరిమితమైన పార్టీ అన్న ముద్రతో ఉన్నది.
ఇటీవల కొంత కాలంగా ఆ ముద్రను తొలగించుకునే పనిని చేపట్టి కొంత వరకు సక్సెస్ అయింది. ఇప్పుడిప్పుడే పార్టీ కింది స్థాయిలో పటిష్టమవుతోంది. అయితే రాష్ట్రంలోని ఇంకా కొన్ని జిల్లాలలో పార్టీ అనుకున్నంత వేగంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతోంది. నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లాలో బీజేపీకి మొదటి నుంచి పట్టులేదు. ఇందుకు కారణాలు అనేకమని నేతలు విశ్లేషిస్తున్నారు. కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలు కావడం, జాతీయ భావాలున్న నేతలు అక్కడ లేకపోవడం, కింది స్థాయిలో పార్టీ ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం వారిని సరైన దిశగా ప్రోత్సహించకపోవడం కారణమని పేర్కొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విస్తరిస్తున్న తరుణంలో నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలలో అనుకున్నంత వేగంగా పార్టీ నిర్మాణం జరగడం లేదని నాయకత్వం భావిస్తోంది. దీన్ని అధిగమించేందుకు అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు తోడుగా కొత్త వారిని జత చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం వేర్వేరు పార్టీలలోని నేతలతో పార్టీ సంప్రదింపులను ప్రారంభించింది. అధికార టీఆర్‌ఎస్‌తో సై అంటే సై అన్నట్లుగా దూసుకుపోతున్న బీజేపీ పట్ల రాష్ట్రంలో జోరుగా చర్చ మొదలైంది. ఈ చర్చ సందర్భంగానే పార్టీని మూలమూలనా తీసుకు వెళ్ళి ప్రజల్లో పాగా వేస్తే సరిపోతుందనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసం కొన్నాళ్ళుగా ఈ రెండు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో పార్టీని నడిపించే సత్తా కలిగిన నేతలెవరన్న అంశంపై ప్రత్యేకంగాఆరా తీయడం, వారితో సంప్రదింపుల కోసం ప్రత్యేక టీంలను కూడా నియమించింది.
అధిష్టానం ఆలోచన, ప్రత్యేక టీంల ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలించకున్న రానున్న కాలంలో పార్టీకి మేలు చేకూరుస్తాయని నాయకత్వం భావిస్తోంది. నల్లగొండ జిల్లాలో బలమైన నేతలుగా పేరొందిన కోమటిరెడ్డి బ్రదర్స్, ఖమ్మంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ముగ్గురు నేతలు పార్టీలోకి వచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారన్న అంశంపై స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలలో పార్టీ టీంల చాలా చురుగ్గా పని చేస్తున్నాయనేది వాస్తవం.
రాష్ట్ర అసెంబ్లీకి ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చన్న అభిప్రాయంతో ఉన్న నాయకత్వం ఆలోగానే అన్నీ సవరించి పటిష్టంగా ఎన్నికలను ఎదుర్కునేందుకు సిద్దం కావాలన్న అభిప్రాయంతో ఉంది. రానున్న రెండు మూడు నెలల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులెవరన్న అంశంపై స్పష్టతకు రావాలని, అందుకు తగిన యోజనను ఇప్పటి నుంచే సిద్దం చేయడంతో పాటు బరిలో దిగనున్న అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తోంది.