Sunday, November 24, 2024

BJP Politics – గొర్రెల పంపిణీలో కేంద్రం తొండి … రుణ నిధులకు బ్రేక్…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రోత్సహించే బాధ్యతగల కేంద్ర ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థ నేషనల్‌ కో-ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) తెలంగాణ సర్కారు గొర్రెల పంపిణీ పథకానికి చేతులెత్తేసింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రెండో విడత పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తక్షణ నిధిగా రూ.1000 కోట్లు సమకూర్చి గొర్రెల కొనుగోళ్లు మొదలుపెట్టారు. మొదటి దశ పథకంలో ఎన్‌సీడీసీ నుంచి రూ.3,956 కోట్ల రుణం మంజూరు కాగా ఇందులో రూ.1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చింది. మిగిలిన రూ.2,956 కోట్లు- మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకున్నది. ఆ రుణాన్ని మొత్తం 16 వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే అసలు రూ.2,626 కోట్లు, వడ్డీ రూ.1,442 కోట్లు మొత్తం పన్నెండు వాయిదాల్లో చెల్లించింది. సెకండ్‌ ఫేజ్‌ కోసం రూ.4,563 కోట్ల మేర రుణం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనపై గతేడాది జూన్‌ 23న ఈ రుణానికి ఎన్‌సీడీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చింది. అనంతరం రాజకీయ కోణంలో కేంద్రం ప్రభుత్వం ఆలోచన తీరు మారడంతో రుణం విడుదల కాలేదు. అయినప్పటికీ ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఆపలేక రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత నిధులతో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్‌ సర్కారు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న నిధులు రూ.535 కోట్లతో ఎన్ని యూనిట్లు- వస్తే అంత మేరకు పంపిణీ చేయాలని నిర్ణయిం చింది. దీనికి కొనసాగింపుగా నిధులను సమకూర్చుకుంటూ లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనుంది.

రూ.6,100 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి రుణం రూపంలో సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా సాకారం కాలేదు. రెండోవిడతలో సుమారు 3.5లక్షల మందికి ఒక్కో యూనిట్‌ రూ.1.75 లక్షల చొప్పున మొత్తం రూ.6,100 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో 25శాతం లబ్ధిదారులైన గొల్ల, కుర్మలు భరిస్తుండగా మరో 20శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. మిగిలిన 55శాతం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఎన్‌సీడీసీ నుంచి రుణం తీసుకోడానికి అనుమతి మంజూరైనా నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నది. కేంద్రం చేతులెత్తేసిన సందర్భంలో మరో మార్గం లేక రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యి కోట్ల రూపాయల సొంత నిధులతో స్కీమ్‌ను మొదలు పెట్టనున్నట్లు ప్రకటించింది. కానీ పశుసంవర్ధక శాఖ, గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి సమాఖ్య దగ్గరున్న నిధులు కలిపి రూ.535 కోట్లు- మాత్రమే ఉన్నట్లు- అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే తమ వంతు వాటాగా 2,797 మంది లబ్ధిదారులు 25శాతం చొప్పున డిపాజిట్‌ కట్టిన డబ్బు కూడా ఉన్నది.

కొనుగోళ్ళలో లబ్ధిదారుల భాగస్వామ్యం
ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇవ్వాల్సిన గొర్రెల యూనిట్లను కొనడానికి వెటర్నరీ డాక్టర్‌ సహా పశు సంవర్ధక శాఖ అధికారుల బృందాలు వారిని కూడా ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్తారు. నకిరేకల్‌లో శుక్రవారం ప్రారంభించనున్న ఈ పథకం కోసం కొన్ని బృందాలు నెల్లూరు, కడప జిల్లాలకు ముందుగానే వెళ్ళాయి. ఏయే జిల్లాల్లో పంపిణీ కోసం గొర్రెలను ఏ రాష్ట్రం నుంచి కొనాలనే షెడ్యూలు ఆ శాఖ అధికారులు సిద్ధం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు బ్రౌన్‌, నెల్లూరు జొడిపి రకం గొర్రెలను కొనాలని భావిస్తున్నారు. కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లాలో సైతం గొర్రెలను కొనడానికి కొన్ని టీ-మ్‌లు వెళ్తున్నాయి. తమిళనాడులో సైతం మద్రాసు రెడ్‌ వెరైటీ- గొర్రెల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రీసైక్లింగ్‌ ఆరోపణలకు దూరంగా చర్యలు
రీసైక్లింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటు-న్నా తెలంగాణ గొర్రెలనే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని గొల్ల, కుర్మలకు అమ్మి తిరిగి వారి నుంచి కొన్నట్లు-గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ వినిపించాయి. మొదటి దశలో జరిగిన గొర్రెల పంపిణీలో రీసైక్లింగ్‌ జరిగినట్లు రాజకీయ విమర్శలు విస్తృతంగా వచ్చాయి. జియో టాగింగ్‌ లాంటి చర్యలు తీసుకున్నా అవకతవకలు ఆగలేదన్న ఆరోపణలకు దూరంగా రెండో దశలో పంపిణీ ప్రక్రియను పూర్తి చేయడానికి పశుసంవర్థక శాఖ అధికారులు సవాళ్ళను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement