న్యూఢిల్లి : వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వానికి సవాల్‌గా మారుతున్నాయి. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లి ఎన్నికల్లో భంగపడ్డ కాషాయపార్టీ, ఆ చేదు ఫలితాలన్ని దిగమింగలేక పోతోంది. ఈ ఏడాది చివరినాటికి మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లిలకు ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటక ప్రభావం ఆయా రాష్ట్రాల్లో విపక్షాలకు సానుకూలంగా ఉంటుం దనే విశ్లేషణలు బీజేపీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత, ప్రజలు ఇప్పుడు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లి ఎన్నికల వైపు చూస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్,రాజస్థాన్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణను భారత రాష్ట్ర సమితి, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్
2000లో మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆవిర్భవించిన ప్రాంతం ఛత్తీస్‌గఢ్. ఇక్కడ రమణ్ సింగ్ నేతృత్వంలోని 15 ఏళ్ల బిజెపి పాలన 2018లో ముగిసింది. గత ఎన్నికల్లో 90 సీట్లలో 68 సీట్లు గెలుచుకుని, 43 శాతం ఓట్ షేర్‌తో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. బీజేపీ 33 శాతం ఓట్లను పొంది కేవలం 15 అసెంబ్లి స్థానాలను గెలుచుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో 2008, 2013లో రెండు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కేవలం ఒక శాతం ఓట్ షేర్ అంతరంతో అధికారాన్ని దక్కించుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)కి కూడా కొంత పట్టు ఉంది. ఈ పార్టీకి 2008లో ఆరు శాతం ఓట్లు, 2013, 2018లో 4 శాతం ఓట్లు వచ్చాయి.
మధ్యప్రదేశ్
ఈ రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు చాలా కాలంగా పోరాడుతున్నాయి. కాషాయ పార్టీ 2004 నుండి (డిసెంబర్ 2018, మార్చి 2020 మధ్య 15 నెలలు మినహా) రాష్ట్రాన్ని పాలిస్తోంది. ఇక్కడ అసెంబ్లి ఎన్నికలు బిజెపికి చాలా ముఖ్యమైనవి. 1990ల ప్రారంభంలో, బిజెపి ఎదుగుతున్నప్పుడు పార్టీకి భారీ మద్దతు లభించిన రాష్ట్రం ఇదే. 2008, 2013లో కాంగ్రెస్‌పై బిజెపి అఖండ విజయాలను సాధించింది. 2008లో, బీజేపీ 6శాతం ఓట్ల ఆధిక్యాన్ని కలిగి ఉంది. కాంగ్రెస్ కంటే రెట్టింపు సీట్లు గెలుచుకుంది. 2013లో, కాంగ్రెస్ కంటే బిజెపికి తొమ్మిది శాతం ఎక్కువ ఓట్లు పొందింది. కాంగ్రెస్ కంటే మూడు రెట్లు ఎక్కువ సీట్లు నెగ్గింది. అయితే, 2018లో బీజేపీ, కాంగ్రెస్‌లకు చెరో 41 శాతం ఓట్లు లభించాయి. వాటా లభించింది. ఏ పార్టీ కూడా 115 అసెంబ్లి స్థానాల మెజారిటీ మార్కును దాటలేదు. అయితే కాంగ్రెస్ 114కి చేరువైంది. బీజేపీ 105 సీట్లు గెలుచుకుంది. 2018లో, బీఎస్‌పీ కేవలం రెండు స్థానాలను గెలుచుకుంది, మాయావతి పార్టీ మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్‌లో చీలిక కారణంగా మధ్యలో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది.
రాజస్థాన్
రాజస్థాన్‌లో 200 అసెంబ్లి స్థానాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల మాదిరిగా కాకుండా, ఈ రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలుగా, అసెంబ్లిd ఎన్నిక ల్లో అధికార పార్టీ ఓడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు బలమైన క్యాడర్, ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో బీజేపీ గెలుపొందినపుడు భారీ విజయం సాధించడం గమనార్హం. కానీ కాంగ్రెస్‌కు మాత్రం స్వల్ప ఆధిక్యమే దక్కింది. 2013లో బీజేపీ 45 శాతం ఓట్లతో 163 సీట్లు గెలుచుకుంది. 33శాతం ఓట్లతో కాంగ్రెస్ 21 అసెంబ్లిd సీట్లకు పరిమితమైంది. 2008, 2018లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు దక్కించుకుంది. కానీ రెండుసార్లు కూడా ఆ పార్టీకి చాలా తక్కువ మార్జిన్ వచ్చింది. 2008లో 101 స్థానాలు సాధించిన కాంగ్రెస్ మాయావతి, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అధికార వ్యతిరేక ధోరణి, కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు ఈసారి కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష కానున్నాయి.
తెలంగాణ
2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. రాష్ట్రంలో 119 అసెంబ్లి స్థానాలు ఉండగా, గత రెండు ఎన్నికల్లోనూ నేటి భారాస, నాటి తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లో జరిగిన అసెంబ్లిd ఎన్నికల్లో 47 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ 88 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 28శాతం ఓట్లతో 19 సీట్లు నెగ్గింది. బీజేపీ మైనర్ ప్లేయర్. గత రెండు అసెంబ్లి ఎన్నికల్లో కేవలం ఏడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గత హదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచి మంచి ఓట్ షేర్ సాధించింది. అలాగే రాష్ట్రంలో జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
మిజోరం
మిజోరం అసెంబ్లిలో మొత్తం 40 సీట్లున్నాయి. 2018 నుండి ఎంఎన్‌ఎఫ్ అధికారంలో ఉంది. రాష్ట్రంలో ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్ మధ్య దీర్ఘకాల పోరు కొనసాగుతోంది. 2008 నుంచి 2018 మధ్య కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలించింది. అయితే గత అసెంబ్లి ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ 38 శాతం ఓట్లతో 27 సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీకి మెజారిటీ రాకపోయినా ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.