దేశవ్యాప్తంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 90వ దశకంలో కశ్మీర్ తిరుగుబాటు సమయంలో కశ్మీరీ హిందువుల వలసల ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో వివాదం నెలకొంది. అయితే, అన్ని అడ్డంకులు తొలిగించుకుని ఇటీవలే విడులైంది. ఈ సినిమాను కొందరు బీజేపీ నాయకులు మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ బీజేపీ నేతపై దాడి జరిగింది.
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా హరిన్ఘట పట్టణంలో బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ వాహనంపై బాంబు దాడి జరిగింది. ఇటీవల విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి తిరిగి వస్తుండగా దాడి జరిగింది. అయితే, కారు వెనుక బాంబు పేలిడంతో, ఎవరూ గాయపడలేదు. అయితే వాహనానికి స్వల్ప నష్టం జరిగినట్లు సమాచారం.
తాను ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చూసి తిరిగి వస్తుండగా తన కారుపై బాంబు విసిరారని ఎంపీ జగన్నాథ్ సర్కార్ అన్నారు. కానీ తాను దాని నుండి (బాంబు) తృటిలో తప్పించుకున్నానని చెప్పారు. 10 నిమిషాల తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారని తెలిపారు. బెంగాల్లో ఎవరికీ భద్రత లేదని, ఇక్కడ ప్రజాస్వామ్యం కూలిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని నివారించడానికి ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన) విధించాలి, లేకుంటే, ఇది ఆగదని ఎంపీ జగన్నాథ్ సర్కార్ పేర్కొన్నారు.