అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లీడర్లు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న వేళ బహిరంగ ర్యాలీలు, మీటింగ్‌లను ఎన్నికల కమిషన్ బ్యాన్ చేసింది. దీంతో ఓటర్లు ప్రసన్నం చేసుకోవడం కోసం నాయకులు ఏకంగా వాళ్ల ఇళ్లలోకే వెళ్లి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కానీ, ఈ బీజేపీ లీడర్ మాత్రం వింత చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. స్నానం చేస్తున్న వ్యక్తినీ వదలకుండ తన ప్రచారం చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
తాజాగా కాన్పూర్‌లోని గోవింద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే సురేంద్ర మియాథాని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేశాడో తెలుసా? ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా అతడి దగ్గరికి వెళ్లి అతడితో ముచ్చటించడం స్టార్ట్ చేశాడు. ఆ వ్యక్తి స్నానం చేస్తున్నా వదలకుండా ఇల్లు ఉందా? అంతా ఓకేనా.. అంటూ ప్రశ్నించాడు. ఆ వ్యక్తి సబ్బుతో శరీరానికి రుద్దుకుంటూనే సమాధానం చెప్పడం.. ఆ తర్వాత రేషన్ కార్డు ఉందా అని ఎమ్మెల్యే ప్రశ్నించడం.. దీంతో ఉంది అని అతడు చెప్పడం జరిగింది.. అయితే దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. వార్నీ.. స్నానం చేస్తున్నవాళ్లను కూడా వదిలిపెట్టరా? ఎన్నికలు ఉంటే ఇలా.. ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ కనిపించరు కదా.. అంటూ నెటిజన్లు ఆ ఎమ్మెల్యేకు కౌంటర్లు వేస్తున్నారు.