కేంద్ర ప్రభుత్వం గత ఏడు ఏళ్ళ నుండి తెలంగాణ ధాన్యాన్ని కొంటుందని, రైతాంగం పండిచిన ధాన్యం మీద మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతుందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్రం రా రైస్ ని మాత్రమే తీసుకుంటామని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ పై ప్రజలకు అసహనం పెరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనక పోవడంతో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాలు పక్కన పెట్టీ రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పే కేసీఆర్ రైతుల ధాన్యం ఎందుకు కొనలేక పోతున్నారని నిలదీశారు. కేంద్రం అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయం అని ముందే చెప్పినా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక కేసీఆర్ మొద్దు నిద్రలో ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరచి రైతులకు న్యాయం చేయాలని ఈటల తెలిపారు.