Thursday, November 21, 2024

హోదా ఏపీకి ఇవ్వరు…పుద్దుచ్చేరికి ఇస్తారా?

ప్రత్యేక హోదా ఏపీ ప్రజల కల. గత ఆరేళ్లుగా హోదా కోసం పోరాడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం. ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు. గత కొంత కాలంగా కేంద్రం పదేపదే చెబుతున్న మాటలు ఇది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని తెలిపారు. అయితే, ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం పుదుచ్చేరి రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రానికి కొత్తగా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని ఒకవైపు చెబుతూనే.. ఇప్పుడు పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారని ఏపీలోని పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన బీజేపీ… ఇప్పుడు పుదుచ్చేరికి ఎలా ఇస్తానని హామీ ఇస్తోందని నిలదీస్తున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించింది. అప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వెంకయ్య నాయుడు.. ప్రత్యేకహోదాను ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల ముందు ఏపీ వచ్చిన బీజేపీ నేతలు సైతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీలు కురిపించారు. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా హామీని పక్కన పెట్టేసింది.

నీతి ఆయోగ్ సూచనల ప్రకారం ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని.. ఇప్పటికే హామీలు ఉన్నవాటికి కూడా ఆ హోదా రద్దు చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. విభజన సందర్భంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాయి. కానీ కేంద్రం ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని.. ఇక ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది. రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ఇక ప్రత్యేక హోదా అన్నది లేదని.. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం కేంద్రం ఇస్తోందని పదే పదే చెబుతూ వస్తున్నారు.  

ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని పదే పదే చెబుతూ వస్తున్న కేంద్రం.. ఇప్పుడు అదే హామీని తెరపైకి తెచ్చింది. నేరుగా తమ మేనిఫెస్టోలో పెట్టింది. దీనిపై ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.

- Advertisement -

మరోవైపు ఈ అంశంపై వైసీపీ, బీజేపీలను ఇరకాటంలో పెట్టింది టీడీపీ. ప్ర‌త్యేక హోదా అంశాన్ని సీఎం జ‌గ‌న్ తాక‌ట్టు పెట్టార‌ని ఆరోపించారు. ఇప్పుడు పుదుచ్చేరికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని బీజేపీ చెబుతుతోంద‌ని, మోదీ మెడ ‌వంచి తెస్తాన‌న్న ప్ర‌త్యేక‌హోదాని ఏమైందని లోకేష్ ప్రశ్నించారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ అధినేత జగన్.. కేంద్రాన్ని ప్రశ్నించలేం అని చేతులు ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేకహోదా ఇవ్వమని అడగడం తప్పా.. ఒప్పించంలేకపోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని చెప్పే బీజేపీ నేతలు.. పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం హోదా ఇస్తామని హామీ ఎలా ఇస్తారన్నది రాజకీయ పార్టీల నేతలతోపాటు సామాన్య ప్రజలు నుంచి ఎదురవుతున్న ప్రశ్న.

ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ ఇలాంటి హామీ ఇస్తుందని, అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా మాటలు మార్చడం ఆపార్టీ అలవాటు అయిందని కాంగ్రెస్, టీడీపీలు ఆరోపిస్తున్నాయి. గతంలో జీహెఎచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా.. ఒక్కసారి అధికారం ఇవ్వండి హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాలను ఎలా తరిమికొడతామో చుడండని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అయితే, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న బెంగాల్ లో మాత్రం రోహింగ్యాలను రక్షణగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. ఇక, తెలంగాణలోని నిజామాబాద్ లో పుసుపు బోర్డు ఇస్తామని.. ఇప్పుడు మళ్లీ మాట మార్చారు. సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఉన్నందున పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని బీజేపీ ఎంపీ అరవింద్‌ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.  తమిళనాడులో ఎన్నికలవేళ మళ్లీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు పుదిచ్చేరి ప్రత్యేక హోదా అంటూ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇదంతా పచ్చి మోసమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో బీజేపీ ప్రజలు నమ్మరని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement