“మీరు వారి మైండ్ సెట్‌ని సరిచేయాలనుకుంటే, ఒకే ఒక మార్గం ఉంది… సంపూర్ణ బహిష్కరణ మాత్రమే దానికి పరిష్కారం”అని బీజేపీ పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పుడీ వివాదాస్పద వ్యాఖ్యలు యావత్ దేశమంతా మంటలను చెలరేగేలా చేశాయి. ఈ మాటలు ఆ పార్టీకి ఎన్నో ఇబ్బందులను తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యక్రమంలో ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ ప్రసంగించారు. ఏ కమ్యూనిటీ లేదా మతం పేరు తాను చెప్పనప్పటికీ ఇట్లాంటి మతపరమైన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులే కాదు.. పర్వేష్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత పార్టీ నాయకత్వానికి కూడా మింగుడు పడడం లేదు.
అయితే.. ఈ వివాదాస్పద కామెంట్స్‌పై ఎంపీ పర్వేష్ నుండి పార్టీ అగ్రనేతలు అధికారిక వివరణ కోరినట్లు ఎటువంటి ధ్రువీకరణ లేదు. అయినా పార్టీలోని కొంతమంది లీడర్లు ఈ వ్యాఖ్యలు తమకు పెద్ద నష్టమే చేకూరుస్తాయని భావిస్తున్నారు. జులైలో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. మతపరమైన సమస్యలపై పార్టీ కార్యకర్తలు అనవసర వివాదాలకు, రాజకీయ ప్రత్యర్థుల ‘ఎర’లకు బలికాకుండా ఉండాలని సూచించారు.
ఇక.. ముస్లిం సమాజంలోని సభ్యులను, ముఖ్యంగా వెనుకబడిన పస్మాండ ముస్లింలను పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇట్లాంటి మతపరమైన కామెంట్స్ పార్టీకి ప్రతికూలంగా మారుతాయని ప్రధాని హెచ్చరించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి సందర్భాల్లో కూడా బీజేపీ సైద్ధాంతిక గురువు అయిన ఆర్‌ఎస్‌ఎస్ ముస్లిం సమాజానికి చేరువయ్యేందుకు అనుగుణంగా బ్రిడ్జిలను నిర్మించడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై వివాదం తర్వాత, మతపరమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని పార్టీ తన నాయకత్వానికి సీరియస్ గానే చెప్పింది. ఇది దౌత్యపరమైన ఇబ్బందిని కూడా తెచ్చిపెట్టిందనే వాదనలున్నాయి. ఇక.. ఆదివారం, బీజేపీ తన ఢిల్లీ యూనిట్ నుండి దాదాపు 70,000 మంది కార్యకర్తలు, నాయకులతో దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్‌లో భారీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ‘పంచ్ పరమేశ్వర్ సమ్మేళనం’ పేరుతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బలమైన మత వ్యతిరేక సందేశాన్ని పంపడానికి దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారో లేదో చూడాలి అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.