ఈడీ విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో కవిత మాట్లాడుతూ… రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవంతో తాను హాజరౌతుంటే, వివిధ స్కాముల్లో చిక్కుకున్న బీజేపీ నేతలు విచారణకు హాజరుకాకుండా దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ విచారణకు రాకుండా ఎక్కడ దాక్కున్నారంటూ తీవ్రంగా ప్రశ్నించారు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి మోడీ కంటే ముందు ఈడీ వస్తోందన్నారు. నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావచ్చని.. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమని చెప్పారు.
తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. ఈడీ విచారణకు నేను పూర్తిగా సహకరిస్తాను. 11న వస్తానని చెప్పినా 9న రావాలని ఈడీ నోటీసు ఇచ్చిందన్నారు. మహిళలను ఇంటికొచ్చి విచారించాలనే చట్టం చెబుతోందని, మహిళలను విచారించే విధానాలకు విరుద్ధంగా తనను విచారణకు పిలిచారన్నారు. తాను ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి.. విచారణ ఎదుర్కొంటాను. బీఎల్ సంతోష్ సిట్ ముందుకు ఎందుకు రాలేదు ? సిట్ ముందుకు వచ్చేందుకు బీఎల్ సంతోష్‌కు భయమెందుకు ? బీజేపీ నేతలు, బీజేపీలో చేరిన నేతలపై కేసులు ఉండవన్నారు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ.. కేసులు పెడుతోందని కవిత అన్నారు.