నల్లగొండ జిల్లా ప్రజల చైతన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని, మునుగోడు ఎన్నికలో అహంకారానికి, అభివృద్ధికి మధ్య జరిగిన పోరాటంలో టీఆర్ఎస్ని గెలిపించిన మునుగోడు ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇవ్వాల (ఆదివారం) హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల కుయుక్తులు, ఆటలు తెలంగాణలో సాగవని ఈ గెలుపుతో మునుగోడు ప్రజలు స్పష్టం చేశారన్నారు.
మొట్టమొదటి సారి ఢిల్లీ నుంచి వందల కోట్ల రూపాయల డబ్బులు, మద్యంతో అధికార మదంతో మునుగోడు ఓటర్లను కొనాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే బీజేపీ అభ్యర్థిగా ఉన్న రాజగోపాల్‌రెడ్డికి చెందిన వ్యక్తి చొప్పరి వేణు కోటి రూపాయలతో దొరికాడని, మరో నేత ఈటల రాజేందర్‌కు చెందిన వ్యక్తి 98 లక్షలతో పట్టుబడ్డది నిజం కాదా అని ప్రశ్నించారు. మరో నేత వివేక్‌కు చెందిన వ్యక్తి నుంచి హవాలా ద్వారా కోట్లాది రూపాయలను తీసుకొచ్చింది నిజం కాదా అని నిలదీశారు మంత్రి కేటీఆర్.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరగానే వివేక్ వెంకటస్వామి హవాలా ఆపరేటర్ మాదిరిగా 75 కోట్లు ఇచ్చింది నిజం కాదా.. సుశీ ఇన్ఫ్రా నుంచి 5.25 కోట్ల రూపాయలు మునుగోడులోని ఓటర్లకు, బీజేపీ నాయకులకు బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసింది నిజం కాదా అని ఆధారాలతో సహా బయటపెట్టారు కేటీఆర్.
15 కంపనీల సీఆర్పీఎఫ్ పోలీసులు అంటే ఒక్కో కంపనీలో దాదాపు 80 మంది ఉంటారు. 40 ఐటీ టీములు ఒక్కోటీమ్‌లో 10 మంది దాకా ఉంటారు.. ఇంత మందిని మునుగోడుకు కేంద్ర ప్రభుత్వం పంపింది నిజం కాదా అని నిలదీశారు. వీటన్నిటిన ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే కేంద్రలోని పెద్దలు ఒత్తిడి చేసి వాటిని అడ్డుకునే యత్నాలు చేసింది నిజం కాదా అన్నారు మంత్రి కేటీఆర్. ధనవంతులను తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంపై రుద్దే ప్రయత్నం చేసింది బీజేపీ అని విమర్శించారు.