Friday, November 22, 2024

సాగర్ దెబ్బ.. బీజేపీకి సీన్ రివర్స్!

నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక వేళ బీజేపీకి వరుసగా షాకుల మీదా షాకులు తగలనున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్ధి కోసం తర్జనభర్జన పడిన బీజేపీ.. చివరికి రవికుమార్ నాయక్‌కు టిక్కెట్ ఇచ్చింది. దీనితో ముందు నుంచి అధిష్టానం టికెట్ ఇస్తుందని ఆశించిన కడారి అంజయ్య, నివేదితారెడ్డిలు భంగపడ్డారు. ఈ ఇద్దరు బీజేపీ అధిష్టానానికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. బీజేపీలో టిక్కెట్ దక్కని వారిపై టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెట్టేసింది. ఇప్పటికే కడారి అంజయ్యతో టీఆర్ఎస్ నేతలు చర్చలు కూడా జరిపారు. చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో బీజేపీ నేత అంజయ్య యాదవ్ కలిశారు. కేసీఆర్ సమక్షంలో అంజయ్య యాదవ్ టీఆర్ఎస్‌లో చేరారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని  తెలిపారు. అటు నివేదితారెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన అభ్యర్థుల ఖరారు అంశంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించి, రవికుమార్‌(ఎస్టీ వర్గం)కు టికెట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, అంజయ్య మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆయనను సంప్రదించి చర్చలు జరుపగా… కారు ఎక్కేందుకు సమ్మతించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్‌ లో బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. ఆ పార్టీ తరఫున బరిలోకి దిగన నివేదితారెడ్డికి కేవలం 2,675 ఓట్లు మాత్రమే వచ్చాయి.  ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్‌ ఆశించిన అంజయ్య  27,858 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల జోష్ లో ఉన్న బీజేపీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిరాశకు గురి చేశాయి. దీంతో సాగర్ పోరులో దుబ్బాక ఫలితం రిపీట్ చేయాలని బీజేపీ భావించింది. అందుకే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటించే వరకు వేచి చూసి.. చివరికి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవికుమార్ ను బరిలో దింపింది. నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. ఇక ప్రచారమే మిగిలింది. ఈ సమయంలో కీలక నేతలు పార్టీని వీడడం బీజేపీ నేతలకు కలవరానికి గురిచేసింది.

దుబ్బాక ఫలితం తర్వాత తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచే పలువురు నేతలకు కాషాయ తీర్ధం కూడా పుచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీ నుంచి కారు వైపు చూస్తున్నారు ఆపార్టీ నేతలు. టికెట్ ఇవ్వలేదనో, పదవి ఇవ్వలేదనో ఇలా కారణం ఏదైనా.. బీజేపీ నాయకుల తీరుపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు అన్నది కాదనలేని నిజం. విజయశాంతి, డీకే అరుణ లాంటి మహిళ నేతలు ఇప్పుడు కనిపించడం లేదు. తరుచూ ప్రభుత్వం విరుచుకుపడే ఈ ఇద్దరు మహిళ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించడం కూడా అరుదుగా మారింది. దీనికి పార్టీ ఆగ్రనాయకత్వ తీరే కారణం అనే టాక్ నడుస్తోంది. ఇక పార్టీలోని మరికొంత మంది కూడా పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు పార్టీ మారితే.. సాగర్ లో బీజేపీకి భారీ నష్టం తప్పదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బీజేపీ చతికిల పడింది. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతోంది. టీఆర్ఎస్ వైపు బీజేపీ నేతలు చూస్తున్నారు. 

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం… అక్కడ నోముల కుమారుడు.. భగత్ కుమార్‌ను తమ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని పోటీలో ఉంచింది. ఏప్రిల్‌ 17న ఎన్నికల పోలింగ్‌ జరుగనుండగా.. మే 2న ఫలితం వెల్లడికానుంది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. దీంతో ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


Advertisement

తాజా వార్తలు

Advertisement