Saturday, November 23, 2024

మాట వినని మాజీ మంత్రి.. మోత్కుపల్లిపై బీజేపీ సీరియస్‌!

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వ్యవహారం ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్‌ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాత్రం హాజరుకావడం ఆస్తికరంగా మారింది. అంతే కాదు, సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి.. మరియమ్మ లాకప్‌ డెత్‌ అంశంలో చర్యలు తీసుకోవడం ద్వారా.. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందంటూ ఆయన అభినందించారు. ఎస్సీల అభివృద్ధి గురించి ఇంత‌గా త‌పించే సీఎం కేసీఆర్‌కు భ‌గ‌వంతుడి ఆశీర్వాదం ఎల్ల‌ప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అన్యాయాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, ఆదుకొని వారికి రక్షణ చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను కోరారు మోత్కుపల్లి. దళిత సాధికారతలో భాగంగా దళారులు లేకుండా నేరుగా దళితులకు ఆర్థికసాయం అందిస్తే మేలు జరుగుతుందని తెలిపారు. రైతుబంధు ప‌థ‌కం మాదిరిగా నేరుగా ఆర్థిక‌సాయం చేస్తే ద‌ళితులు సంతోషిస్తారన్నారు.

ఆదివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌’ పథకం విధి విధానాలపై అఖిలపక్షం చర్చించింది. కాంగ్రెస్ నేత భట్టి‌ విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఈ భేటీకి హాజరయ్యారు. అయితే, అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించగా, ఆ ఆదేశాలు పట్టించుకోకుండా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. అదే సమయంలో బీజేపీ కార్యాలయంలో దళిత నేతల భేటీకి ఆయన డుమ్మా కొట్టారు. దీంతో మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్‌ అయినట్లు సమాచారం. వద్దన్నా వినకుండా అఖిపక్ష భేటీకి హాజరు కావాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ద‌ళితుల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement