Friday, November 22, 2024

అటు అంజయ్య.. ఇటు రవి.. మరి నివేదితా ఏటూ?

తెలంగాణ‌లో నాగార్జున ‌సాగ‌ర్ ఉప ఎన్నిక రస‌వ‌త్త‌ర‌మైన రాజ‌కీయ సంగ్రామానికి వేదిక‌వుతోంది. ఓవైపు పార్టీలు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు రెడీ అవుతుంటే.. మరోవైపు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీలో తిరుగుబాటుకు కారణమవుతుంది. పార్టీ టికెట్ తమకు కేటాయించకపోవడంపై సీనియర్ నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.

సాగర్ బీజేపీ అభ్యర్థిగా రవికుమార్ నామినేషన్ వేశారు. అయితే, బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆ పార్టీ నాయకురాలు కంకణాల నివేదిత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నివేదిత రెడ్డి పోటీ చేశారు. పార్టీ తనకే టికెట్‌ ఖరారు చేస్తుందన్న నమ్మకంతో ఆమె ముందే నామినేషన్‌ దాఖలు చేశారు. అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం ప్రకటన చేయకముందే నివేదిత నామినేషన్‌ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇప్పుడు పార్టీనే మారిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సాగర్ టికెట్ కేటాయింపులో బీజేపీ అధిష్ఠానం తనకు తీవ్ర అన్యాయం చేసిందనే భావనలో ఉన్న నివేదిత.. ఇక గులాబీ తీర్ధం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత కడారి అంజయ్య టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయిపోయారు. ఇప్పుడు ఆదేరిలో నివేదిత కూడా వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అధికార పార్టీలో పదవులపై హామీ లభిస్తే.. వెళ్లేందుకు రెడీ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు నివేదితతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ రెబల్ అభ్యర్థిగా నివేదితా బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, నివేదితను బీజేపీ సీనియర్లు బుజ్జగిస్తున్నారని సమాచారం. పలు రకాల హామీలతో ఆమెకు నచ్చజెబుతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద నివేదిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement