రాజకీయాల్లో కీలక ఘట్టం ఎన్నికలు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం కొత్తేమీ కాదు. ఎన్నికల సమయంలో లేదా పదవులు ఇవ్వలేదనో పార్టీలు మారుతారు. ఎన్నికల్లో పోటీ కోసం నేతలు ఏమైనా చేస్తారు. చట్టసభలకు వెళ్లేందుకు ప్రవేశ పరీక్షైన ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. పార్టీలు మారుతుంటారు, నియోజకవర్గాలు మారుతుంటారు. తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు వేడి పెంచుతోంది. ఉపఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో టీఆర్ఎస్, బీజేపీలు అచితూచి వ్యవహరించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించేదాకా వ్యూహాత్మకంగా వేచి చూసిన బీజేపీ… అనంతరం రవికుమార్ ను ఫిక్స్ చేసింది.
దీంతో బీజేపీ కీలక నేత టీఆర్ఎస్ లోకి చేరేందుకు రెడీ అయ్యారు. బీజేపీ టికెట్ ఆశించి నిరాశకు గురైన కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్‌లోకి చేరేందుకు నిర్ణయించుకున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో కడారి బీజేపీ టికెట్ ఆశించగా చివరి నిమిషంలో రవికుమార్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో అంజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో చేరికపై అంజయ్యతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ సమక్షంలో అంజయ్య యాదవ్ టీఆర్ఎస్‌లో చేరనున్నారు.
టీఆర్ఎస్ తమ పార్టీ తరపున అభ్యర్థిని ప్రకటిస్తే ఆ తర్వాత అసంతృప్త నేతలను లాక్కుని వారిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావించింది. అయితే బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ అంజయ్య యాదవ్‌ను టీఆర్ఎస్ తమ పార్టీలోకి చేర్చుకోవడం గమనార్హం. దీంతో బీజేపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. దుబ్బాక సీన్ ను రిపీట్ చేద్దామనుకున్న నేతలకు పార్టీ కీలక నేత ఇలా కారెక్కడం బీజేపీకి మైనస్ గా మారింది.