మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీలో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, అతని బావ మరిదిపై కేసు నమోదు అయ్యింది. తన పెళ్లికి మూడు రోజుల ముందు (జనవరి 27న) బీజేపీ లీడర్ కోమల్ గుప్తా, అతని బావమరిది ధర్మేంద్ర గుప్తా తనను కిడ్నాప్ చేశారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కాగా, బాలిక కుటుంబ సభ్యులు అదే రోజు తమ కూతురు కనిపించడం లేదని కంప్లెయింట్ ఇచ్చారు.
ధర్మేంద్ర గుప్తా, కోమల్ గుప్తా తనను బలవంతంగా ఎత్తుకెళ్లారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనను కిడ్నా ప్ చేసిన తర్వాత కోమల్ గుప్తా.. ధర్మేంద్ర గుప్తా నుంచి విడిగా వెళ్లిపోయాడని, అయితే తనకు జబల్‌పూర్ సమీపంలో స్పృహ వచ్చినట్టు బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత ఆమెను బస్సులో బాలాఘాట్‌కు తీసుకెళ్లి అక్కడ ధర్మేంద్ర గుప్తా తన మేనత్త నివాసంలో బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలిపింది.
సింగ్రౌలీ ఎస్పీ బీరేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోమల్ గుప్తా పరారీలో ఉన్నాడని, ప్రధాన నిందితుడైన ధర్మేంద్ర గుప్తాను అరెస్టు చేసినట్లు చెప్పారు. ధర్మేంద్ర గుప్తా తనపై అత్యాచారం చేశాడని, కిడ్నాప్‌కు కోమల్ గుప్తా సహకరించాడని బాధితురాలు ఆరోపించింది. నిందితులిద్దరిపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు. కాగా, ఫిబ్రవరి 19న బాలాఘాట్ నుంచి ఆ బాలికను కాపాడి తీసుకొచ్చినట్టు పోలీసు అధికారులు తెలిపారు.