Friday, November 22, 2024

బీజేపీ కా సాత్, దేశ్‌ కా వినాష్.. హైద‌రాబాద్‌లో ఆప్ ఆధ్వ‌ర్యంలో నిరసన ర్యాలీ

హైదరాబాద్: సబ్ కా సాత్.. సబ్ కా వికాష్ అని చెప్పి మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ కా సాత్…దేశ్ కా వినాష్‌గా మారిపోయిందని తెలంగాణ ఆప్ సర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరా శోభన్ ఆరోపించారు. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ హైద‌రాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్‌బండ్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఖాళీ సిలెండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరా శోభ‌న్ మాట్లాడుతూ ప్ర‌ధానిగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర సరుకులు మొదలుకొని పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అత్యంత వేగంతో పెరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా గ్యాస్ సిలెండర్ ధర వెయ్యి రూపాయలు దాటడంతో మహిళలు వంట వండలేక తిరిగి కట్టెల పొయ్యిని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

కార్పొరేట్ కంపెనీలకు ఆదాయం సమకూర్చే పనిలో ప్ర‌ధాని మోడీ పడ్డారని, వారు ఎలా చెబితే అలా వింటూ ధరల పెరుగుదలకు అనుమతి ఇవ్వడం సిగ్గు చేటన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూపోవడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర సరుకుల ధరలపై కూడా పడుతుందన్నారు. పెరిగిన ధరలతో పేద, సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే పేదలందరు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని చెప్పారు. కనుక ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడం మానుకొని నిత్యావసర ధరలు మొదలుకొని పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు.

ప్రజలు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రశ్నించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలపై మరిన్ని భారాలు మోపి బతుకులు దుర్భరం చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. కనుక పెరిగే ధరలకు అడ్డుకట్ట వేయాలన్నా, పేద ప్రజల జీవితాల్లో వెలుగు రావాలన్నా బీజేపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. పేదల కోసం ఆలోచించే ఆప్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement