తెలంగాణలో ప్రజలు ఇప్పుడు బిజెపిపై మాత్రమే నమ్మకం కలిగి ఉన్నారని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. న్యూఢిల్లీలో పార్టీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. స్థిరత్వం, నిబద్దత, కృషి వల్ల పార్టీ ఇద్దరు ఎంపీల నుంచి ఇప్పుడు 300 మందికి పైగా పెరిగిందని గుర్తు చేశారు. సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోందని అన్నారు. బీజేపీలో యువకులు ప్రోత్సహించబడుతున్నారని చెప్పారు. సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ విధానంతో ఈశాన్య రాష్ట్రాలను గెలవగలిగామని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకే వచ్చాయని తెలిపారు. ఈశాన్యం నుంచి పశ్చిమం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు బీజేపీ ఏకైక పాన్-ఇండియా పార్టీగా మారిందని చెప్పారు. దక్షిణాదిలో బీజేపీ విషయానికి వస్తే.. కర్ణాటకలో బలంగా ఉన్నామన్నారు.
తెలంగాణలో ప్రజలు ఇప్పుడు ఒక్క బీజేపీపై మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు తమ వైపు చూస్తున్నారని అన్నారు. తమిళనాడు, కేరళలో బీజేపీ ప్రతి జిల్లాలోనూ తన పునాదిని పటిష్టం చేసిందని చెప్పారు. కాగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 4 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. ఆ తర్వాత నుంచి ఇక్కడ ప్రత్యేక దృష్టి కనబరుస్తుంది. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలే రాబట్టిన బీజేపీ.. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలను అందుకుంది. ఈ పరిణామాలు బీజేపీలో జోష్‌ను నింపాయి. తెలంగాణలో బీజేపీ పురోగతిపై ఆరా తీయడంపై.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆ పార్టీ అధినాయకత్వం రాష్ట్ర నాయకులకు మార్గ నిర్దేశం చేస్తూనే ఉంది.