Tuesday, November 26, 2024

UP election results: యూపీలో బీజేపీదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్న యోగి ఆదిత్యనాథ్.. 37 ఏళ్ల తర్వాత..

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి బీజేపీకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది.  ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళిని బట్టి బీజేపీ 260కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ 125 చోట్ల, బీఎస్పీ 5, కాంగ్రెస్ 3, ఇతరులు 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా రెండోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

1985 తర్వాత యూపీలో వరుసగా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. కానీ, ఈ సంప్రదాయానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్తి పలికారు. 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి ఓ పార్టీ అధికారంలోకి రానుంది. 1985 నుంచి ఏ  సీఎం కూడా తర్వాతి ఎన్నికల్లో గెలవలేదు. 15 ఏళ్ల తర్వాత ఓ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కుర్చీని అధిష్టించనున్నాడు. 2007లో మాయావతి, 2012లో అఖిలేష్ యాదవ్, ఆ తర్వాత 2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ముగ్గురూ శాసనమండలి ద్వారానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో నోయిడాకు వెళ్ళిన ఏ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఈ మూఢనమ్మకాల భయం నేతల్లో ఎంతగా ఉందంటే ముఖ్యమంత్రిగా ఒక్కసారి కూడా అఖిలేష్ యాదవ్ నోయిడాకు వెళ్ళలేదు. ములాయం సింగ్ యాదవ్, ఎన్డీ తివారీ, కళ్యాణ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి నేతలు కూడా నోయిడాకు దూరం పాటించారు. 2007, 2012 మధ్య, మాయావతి ఈ అపోహను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. రెండు సార్లు నోయిడా వెళ్లారు. కానీ 2012లో ఆమె అధికారం కోల్పోయారు. కానీ యోగి ఆదిత్యనాథ్ తన పదవీ కాలంలో అనేక సార్లు నోయిడాను సందర్శించారు. ఇప్పుడు ఈ అపోహ కూడా బద్దలయ్యేలా కనిపిస్తోంది.

కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లోనే బీజేపీ భారీ ఆధిక్యతతో దూసుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి కొనసాగేందుకు సిద్ధమైంది. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ఎలక్షన్ బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. యుపి అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో జరిగాయి. యూపీలోని 403 స్థానాల్లో బీజేపీ 200 మార్కును దాటి మెజారిటీ సాధించగలదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ సరైనవేనని ట్రెండ్స్ చెబుతున్నాయి. అయితే ఓట్ల లెక్కింపుకు ముందు అఖిలేష్ యాదవ్ ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో కొందరు పోల్ అధికారులను తొలగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement