తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. క్రితం సారి నిర్ణీత సమయానికి 6 నెలలు ముందుగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రస్తుత సభకు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే గడువు ముగియనుంది. ప్రతి ఐదేళ్లకోమారు ఎన్నికలు జరగాలన్న నిబంధన మేరకు వచ్చే ఏడాది డిసెంబర్‌లోగానే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు అధికార టీఆర్ఎస్‌తో పాటు విపక్షాలు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
రెండు వరుస ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీతో రెట్టించిన ఉత్సాహంతో సాగుతున్న బీజేపీ ఈ దఫా తెలంగాణలో అధికార పగ్గాలు దక్కేది తమకేనన్న ధీమాతో ఉంది. అదే భావనతో సాగుతున్న బీజేపీ రాష్ట్ర శాఖ శుక్రవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూర్తి స్థాయి జాబితా విడుదల చేశారు. నియోజకవర్గాల ఇంచార్జీలే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో… తాజా జాబితాతో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.