బీజేపీ అంటేనే ఓ బ్రోకర్ల పార్టీ అనీ, కాంగ్రెస్‌లో జేబులు కట్ చేసి నిజామాబాద్ ఎంపీ బ్లేడ్ బాబ్జీగా మారాడని, అందుకే గొంతు కోసుకుంటా అంటున్నాడని.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణేశ్ గుప్తాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెబుతారని, అంత ఆవేశం పనికి రాదన్నారు. గతంలో బండ్ల గణేశ్‌కు పట్టినగతే ఇప్పుడు వారికి పడుతుందన్నారు. ఇలాంటి బ్యాచ్ చాలా మంది జమయ్యారనీ, ఉత్తమ్ కుమార్‌రెడ్డి గడ్డం తీసుకోను అని ఏమయ్యారో అందరికీ తెలిసిందేనన్నారు.
బ్లేడ్ సిద్ధాంతం టీఆర్ఎస్‌కు బాగా కలిసి వస్తుంది.. మళ్లీ పక్కా టీఆర్ఎస్ అధికారం ఖాయమని జీవన్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఎల్లమ్మ తల్లిపై తప్పుగా మాట్లాడిన ఎంపీ ముక్కు నేలకు రాయాలని, 2023లో ఆయనను ఎల్లమ్మ రాజకీయంగా బలి తీసుకుటుందన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పసుపు రైతులను మోసం చేసినందుకు గొంతు కోసుకోవాలనీ, నిజామాబాద్‌లో మొత్తం క్లీన్ స్వీప్ టీఆర్ఎస్ చేయబోతుందని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టూరిస్ట్ మినిస్టర్ అనీ.. మధ్యప్రదేశ్, బిహార్ విషయాల్లో అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో బీజేపీ వాళ్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. కేటీఆర్, కవిత వంటి గొప్ప వ్యక్తుల గురించి అడ్డగోలుగా మాట్లాడితే వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా రూ.50వేల కోట్ల పెన్షన్లు ఇచ్చామని, 24గంటల కరెంటు ఇచ్చామని చెప్పారని.. అవి అబద్ధమని చెప్పే దమ్ము బీజేపీ ఉందా? అని ప్రశ్నించారు జీవన్‌రెడ్డి. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు వైభవంగా జరుపుకుంటామనీ, ప్రతి ఊరిలో గులాబీ జెండా పండుగ జరుగుతుందన్నారు.