ఇంధన ధరలను ప్రతిరోజూ పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్న మోదీ సర్కార్‌పై బీజేపీ భాగస్వామ్యపక్షం భగ్గుమంది. గత పదిహేను రోజులుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే వెనక్కితీసుకోవాలని బీజేపీ భాగస్వామ్య పక్షం జనతాదళ్ (యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ఇవ్వాల డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరల పెంపును ఉపసంహరించాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని త్యాగి స్పష్టం చేశారు.
ద్రవ్యోల్బణంపై ఇంధన ధరల పెంపు పెను ప్రభావం చూపుతుందని.. పెరిగిన ధరలను కేంద్రం వెనక్కితీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎన్‌డీఏకు ఓటు వేసిన ఓటర్లపై ఈ ప్రభుత్వం ద్రవ్యోల్బణం భారం మోపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మంగళవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు 80 పైసలు పెంచగా ఈ రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ 9.20 చొప్పున భారమైంది. రెండు వారాలుగా రోజూ పెట్రో ధరల మోతతో పలు నగరాల్లో పెట్రో ధరలు రికార్డు స్దాయికి ఎగబాకాయి.