– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన పేరుతో బీజేపీ ఓ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇవ్వాల (గురువారం) ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని బాటసింగారం వెళ్లేందుకు యత్నించారు. అయితే.. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లతో కాన్వాయ్‌లో వెళ్తుండగా ఓఆర్ఆర్పై పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఇతర నేతలు పోలీసులను ప్రతిఘటించారు.
కాగా, అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను, బీజేపీ శ్రేణులను గుమిగూడకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసు జులుం డౌన్, డౌన్ అంటూ నినాదాలు మిన్నంటాయి. అయినా పోలీసులు వారిని స్మూత్‌గా వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఇక.. కిషన్‌రెడ్డి తన వాహనంలోనే ఉండి పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తానేమైనా ఉగ్రవాదినా, టెర్రరిస్టునా? అంటూ ప్రశ్నించారు. ఇది భారత రాజ్యాంగమా, కల్వకుంట్ల రాజ్యాంగమా అని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా తనకు ఎక్కడైనా వెళ్లే హక్కుందని, తననెవరూ అడ్డుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే.. ఈ ప్రోగ్రామ్‌కి ముందస్తు అనుమతి లేదని, అందుకనే అడ్డుకుంటున్నామని పోలీసులు బీజేపీ నేతలకు స్పష్టం చేశారు. అయినా కావాలనే బీజేపీ నేత కిషన్‌రెడ్డి, ఇతర లీడర్లు వర్షంలో తడుస్తూ అక్కడే కింద కూర్చొని సీన్ క్రియేట్ చేశారు. దీంతో పోలీసులు వారి వాహనంలోనే తీసుకెళ్లి అరెస్టు చేశారు.