హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశ స్వాతంత్య్ర, హైదరాబాద్ స్వాతంత్రోద్యమంలో బీజేపీ పాత్ర ఏమి లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రకు బీజేపీకి ఎలాంటి లేకపోవడంతోనే.. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులను, చరిత్ర కలిగిన నేతలను బీజేపీ దొంగిలిస్తోందని ఆయన మండిపడ్డారు. సర్దార్ పటేల్ మా వాడు.. ఆయనది కాంగ్రెస్ కుటంబమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 17పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ముస్లింలు, హిందువుల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
పటేల్‌ను ఆర్‌ఎస్‌ఎస్ నిషేధించిందన్నారు. అసదుద్దీన్‌ను భూతంగా చూపించి తెలంగాణను ఆక్రమించుకోవాలని బీజేపీ కుట్ర పన్నుతుందన్నారు. శనివారం గాంధీభవన్ తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కవి, రచయిత అందె శ్రీ రాసిన ‘ జయ జయ జయహే ‘ తెలంగాణ పాటతో వజ్రోత్సవాలు ప్రారంభంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్‌రెడ్డి ఆవిష్కరించడంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది ఉద్యమకారుల వీరోచిత పోరాటమే ఈ స్వేచ్ఛా అని, అమరవీరులను స్మరించుకుంటూ, వారి గొప్ప తనం, త్యాగాలను భవిష్యత్ తరాలకు చెప్పాల్సి అవసరం ఉందన్నారు.
‘ భూ స్వాములకు వ్యతిరేకంగా కమ్యునిష్టులతో కలి పోరాటం చేశారు. బ్రిటిష్ స్వామ్రజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బైరాంపల్లి లాంటి ఘటనలు తెలంగాణలో ఎన్నో జరిగాయి. వేలాది మంది వీరులు పోరాటం చేశారు. ఆ చరిత్రను కొందరు వక్రీకరిస్తూ.. ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు. వల్లాబాయ్ పటేలు ఉప ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలోని వందలాది సంస్థానాలున్నాయి. కొన్ని దేశంలో వీలనమైనాయి. కానీ మూడు ప్రాంతాలైన హైదరాబాద్ స్టేట్, జమ్మూ కశ్మీర్, గుజరాత్‌లోని జునెఘడ్ విలీనం కాలేదు. జునెఘడ్ రాష్ట్రం భారత్‌లో కలవమని, పాకిస్తాన్‌లో కలుస్తామని అక్కడి రాజు అన్నాడు. ఆ రాజు ముస్లిం రాజే . పటేల్ అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాన్ని దేశంలో విలీనం చేశారు. అక్కడెందుకు వజ్రోత్సవాలు నిర్వహించడం లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక్కడికి వచ్చారు. ప్రధాన మంత్రి మోడీ ఆదేశాలతో ఇక్కడికి సెప్టెంబర్ 17 వేడుకలు జరుపుతున్నారా..? లేక మోడీకి సంబంధం లేకుండానే అమిత్ షా వచ్చారా..?. అప్పటి ప్రధాని నెహ్రు ఆదేశాలతోనే పటేల్ వచ్చి హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశారు.
గాంధీభవన్‌కు వల్లాబాయ్ పటేలే పునాదులు వేసిండు. ఆయన విగ్రహానికి దండ వేసే నైతిక హక్కు బీజేపీకి లేదు. దేశంలో విస్తరించడానికి బీజేపీ కుట్రలు చేస్తోంది. దేశ సంపదను కార్పోరేట్ కంపెనీలకు దోచి పెడుతోంది. రెచ్చగొట్టడం కాదు.. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రణాళిక ఎంటో చెప్పాలి. ఇక్కడి పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకుపోవాలని కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ సమాజం మెల్కోని తిప్పికొట్టాలి ‘ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఎనిమిదేళ్లుగా గుర్తుకు రాలేదా..?
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలనే సోయి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎనిమిదేళ్లుగా గుర్తుకు రాలేదా..? అని రేవంత్‌రెడ్డి నిలదీశారు. కేసీఆర్ స్వీయ చరిత్ర, కుటుంబ చరిత్రను రాసుకోవడానికే అసలు చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్‌ను టీజీగా, అందే శ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా, సబ్బండ వర్గాల తల్లిగా తెలంగాణ తల్లిని రూపొందిస్తామని, విగ్రహానికి సంబంధించి నమూనా విడుదల చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని, రాష్ట్ర కొత్త జెండా కూడా రూపుదిద్దుకుంటోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.